ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులకు బొబ్బిలికి చెందిన భక్తులు సోమ వారం రూ.3 లక్షల విరాళం సమర్పించారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన చనమల్ల కనకరాజు, కమల కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ పర్యవేక్షకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ శాఖల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల కోసం 1064 టోల్ ఫ్రీ నంబరును ప్రజలు వినియోగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో అవినీతి నిరోధక శాఖ రూపొందించిన ప్రత్యేక ప్రచార పోస్టర్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అవినీతిపై ఫిర్యాదులు చేసేందుకు వాట్సాప్ నంబరు (94404 40057) అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ బి.వి. సుబ్బారావు, ఇన్‌స్పెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కనకదుర్గమ్మ సన్నిధిలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.4.36 కోట్ల మేర కానుకలను సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో సోమవారం హుండీ కానుకల లెక్కింపు జరిగింది. రూ.4,36,76,000 నగదు, 140 గ్రాముల బంగారం, 4.360 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలి పారు. విదేశాలకు చెందిన కరెన్సీ కూడా లభ్య మైనట్లు పేర్కొన్నారు. యూఎస్‌ఏ డాలర్లు 232, 125 యూఏఈ దిర్హమ్స్, 500 న్యూజి ల్యాండ్ డాలర్లు, 50 ఆస్ట్రేలియా డాలర్లు లభించాయి. హుండీ కానుకల లెక్కింపు మంగళ వారం కూడా కొనసాగుతుందని ఆలయ అధికా రులు వెల్లడించారు.
పటమట(విజయవాడతూర్పు): నగరంలోని ఆంధ్ర లయోల కళాశాలలో ఏర్పాటు చేసిన మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఏపీ జెన్కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ప్రదేశం, ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు, సిబ్బంది బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మ్యాప్ ద్వారా పరిశీలించి, ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బంది రాకపోకలు, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, ఎ.శ్రీధర్, చీఫ్ ఇంజినీర్ పి. సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.


