గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించిన ఆదికవి మహర్షి వాల్మీకి బోధనలు, జీవిత ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. రామాయణ మహాకావ్యం నిత్యనూతనమని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర తదితరులు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. దృఢ సంకల్పం, పరివర్తనతో సామాన్య వ్యక్తి కూడా మహర్షిగా మారవచ్చని వాల్మీకి తన జీవితం ద్వారా నిరూపించారని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. తప్పులను సరిదిద్దుకుని సన్మార్గంలో పయనించవచ్చనే గొప్ప సందేశం వాల్మీకి జీవితం అందించిందన్నారు. మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ.. వాల్మీకి సాహిత్యం సాంస్కృతిక వారసత్వానికి మూలస్తంభమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.నరసింహం, ఆర్డీఓ వెన్నెల శ్రీను, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


