ఎన్టీఆర్ జిల్లా ఎల్డీఎం వెంకట సుబ్బయ్య
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలోని బ్యాంకులు ఆదివారం రోజు సైతం సమర్థంగా పనిచేసి ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను అందించాయని జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి. వెంకట సుబ్బయ్య తెలిపారు. ఆదివారం అయినా బ్యాంకుల్లో లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయని, ప్రజలు బ్యాంకింగ్ సేవలను విస్తృతంగా వినియోగించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించిన బ్యాంకు అధికారులు, సిబ్బంది కృషిని ఆయన అభినందించారు.
చల్లపల్లి: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న వేళ నిమ్మకాయ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. అకాల వర్షాలకు పూత రాలిపోవడం, అనంతరం ఎండల తీవ్రతతో దిగుబడి తగ్గిపోవడంతో సరఫరా తగ్గింది. దీంతో గతంలో రూ.3 నుంచి 5కు లభించిన నిమ్మకాయ ప్రస్తుతం సైజును బట్టి రూ.10 నుంచి రూ.15 వరకు ధర పలుకుతోంది. ధరల పెరుగుదలతో హోటళ్లు, జ్యూస్ సెంటర్లు, సోడా వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క సోడా రూ.20కు విక్రయిస్తే అందులో నిమ్మకాయ ఖర్చే గణనీయంగా ఉంటోందని వ్యాపారులు వాపోతున్నారు. ఎండల కారణంగా డిమాండ్ కొనసాగుతుండగా, సరఫరా తగ్గడంతో ధరలు మరింత పెరుగుతున్నాయని చెబుతున్నారు. నిమ్మ ధరలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
60 అడుగుల ఎత్తు నుంచి జారిపడి మృతి
రైల్వేస్టేషన్/చిట్టినగర్ (విజయవాడపశ్చిమ): నగరంలో చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్ సమీపంలోని ఈఎల్‌ఎస్ (ఎలక్ట్రికల్ లోకో షెడ్)లో ఆదివారం మధ్యాహ్నం 60 అడుగుల ఎత్తు ఉన్న క్రేన్‌కు ఓవర్ ఆయిలింగ్ చేస్తూ టెక్నీ షియన్ ప్రమాదవశాత్తు జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం ఈఎల్‌ఎస్‌లో రైలు ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతులు జరుగుతుంటాయి. ఆదివారం సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటంతో క్రేన్‌కు ఓవర్ ఆయిలింగ్ పనులు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించడంతో నగరంలోని కంసాలిపేటకు చెందిన టెక్నీషియన్ అమల కంటి ధర్మజ్యోతి బాబు మరో టెక్నిషియన్‌తో కలసి షెడ్డు పైభాగంలో పని చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సహచరులు అతన్ని రైల్వే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
భద్రత ఏర్పాట్లు లేకపోవడమే కారణం!
ఆదివారం లోకోషెడ్డులో కార్మికులు ఉండకపోవడంతో ఓవర్ ఆయిలింగ్ పనులను అధికారులు కేటాయించారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయాల్సినప్పుడు కార్మికుల భధ్రత కోసం చేపట్టాల్సిన కనీస చర్యలను మాత్రం వారు విస్మరించారు. దీని కారణంగానే పనిచేస్తూ ప్రమాదవశాత్తు 60 అడుగుల ఎత్తు నుంచి కార్మికుడు పడి మృత్యువాత పడ్డాడు.
గంపలగూడెం: స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట శనివారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. గంపలగూడెం ఎస్సీ కాలనీకి చెందిన కోట నాగేశ్వరరావు(60) నడచి వెళుతుండగా తిరువూరు నుంచి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తరిగొప్పుల సాయికుమార్ ఢీకొట్టాడు. ఘటనలో నాగేశ్వరరావు తలకు బలమైన గాయమవ్వగా ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు వెంకయ్య ఫిర్యాదుపై గంపలగూడెం ఎస్‌ఐ అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


