జాషువాకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

జాషువాకు ఘన నివాళి

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సమానత్వం, మానవ హక్కుల కోసం కలంతో పోరాడిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతిని సోమ వారం నిర్వహించారు. జాషువా చిత్రపటానికి ముఖ్య అతిథి, మంత్రి దుర్గేష్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంటరానితనాన్ని ఎదు ర్కోవడానికి అక్షరాన్ని ఆయుధంగా మలచుకున్న ధీశాలి జాషువా అని కొనియాడారు. కవిత్వంతో మూఢాచారాలపై తిరగబడ్డారని గుర్తుచేశారు. అనంతరం తెలుగు సాహిత్య వికాసానికి విశేష కృషి చేసిన సాహితీవేత్తలు షేక్‌ కరీముల్లా, డాక్టర్‌ జాలాది విజయకుమారి, విల్సన్‌ రావు కొమ్మవరపు, గడ్డం ఈశ్వరమ్మకు గుర్రం జాషువా సాహితీ పురస్కారం కింద రూ.50 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. నాటక రంగ అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్‌ పర్సన్‌ తేజస్వీ పొడపాటి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ రేగుళ్ల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ భక్తుల కోసం మరో బ్యాటరీ వాహనం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ భక్తుల కోసం ఏపీ గ్రామీణ బ్యాంక్‌ బ్యాటరీ వాహనాన్ని అందజేసింది. అమ్మవారి ఆలయ ప్రాంగణం మహామండపం దిగువన సోమ వారం బ్యాటరీ వాహనానికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించగా, చైర్మన్‌ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్‌ ప్రారంభించారు. 14 మంది భక్తులు ప్రయాణించేలా పెద్ద బ్యాటరీ వాహనాన్ని బ్యాంక్‌ అందజేయడం అభినందనీయ మని పేర్కొన్నారు. అనంతరం బ్యాంక్‌ అధికా రులతో కలిసి ఈఓ శీనానాయక్‌ బ్యాటరీ వాహనంపై ప్రయాణించారు.

డివిజన్‌లో నీటి నాణ్యత పరీక్షలు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించగా 100 శాతం బ్యాక్టీరియా లజీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలిందని అధికారులు ప్రకటించారు. డివిజన్‌లోని పలు రైల్వేస్టేషన్లు, ఇతర రైల్వే ప్రాంగణాల్లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్‌ 22వ తేదీ వరకు నీటి పరీక్షల ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. 99 రైల్వే స్టేషన్లలో 633 బ్యాక్టీరియాలజీ నమూనాలను పరీక్షించగా అన్నీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తెలిందని అధికా రులు వెల్లడించారు. 28 స్టేషన్లలో 29 నమూనాలకు రసాయన పరీక్షలు నిర్వహించగా 19 ప్రమాణాలకు అనుగుణంగా, పది నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. నీటి శుద్ధి సామర్థ్యాన్ని పర్యవేక్షించేందుకు 83 స్టేషన్లలో 9,571 అవశేష క్లోరిన్‌ పరీక్షలు నిర్వహించారు. 99.93 శాతం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలింది.

రాష్ట్ర స్థాయి సదస్సులో పీజీ విద్యార్థిని ప్రతిభ

లబ్బీపేట(విజయవాడతూర్పు): తిరుపతిలో ఇటీవల జరిగిన జనరల్‌ సర్జరీ (శస్త్ర చికిత్స) నిపుణుల రాష్ట్ర వైద్య విజ్ఞాన సదస్సులో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల జనరల్‌ సర్జరీ విభాగం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్థిని డాక్టర్‌ దువ్వూరు హిమవర్ష సత్తాచాటారు. ఈ సదస్సులో అరుదైన ‘పెద్ద ఉదర శ్రోణి ద్రవ్య రాశిగా వ్యక్తమైన గ్యాస్ట్రోబ్లాస్టోమా’ కేసుపై చేసిన పోస్టర్‌ ప్రజెంటేషన్‌కు ‘బెస్ట్‌ పోస్టర్‌’ బహుమతి లభించింది. ఈ సందర్భంగా పీజీ విద్యార్థిని హిమవర్షను సోమవారం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో శస్త్ర చికిత్స వైద్యవిభాగ అధిపతి డాక్టర్‌ జి.పద్మశ్రీ, ప్రొఫెసర్‌లు కె.బి.ఎన్‌.ప్రభాకర్‌, జ్వలిత, అసో సియేట్‌ ప్రొఫెసర్‌లు సుఫియా, విజేత, అసిస్టెంట్‌లు చంద్రకాంత్‌, బి.ఎస్‌.పి.యాదవ్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement