ధ్రువపత్రం.. జారీలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

ధ్రువపత్రం.. జారీలో జాప్యం

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

● ఆగిన జనన, మరణ ధ్రువపత్రాల జారీ ● పనిచేయని ఎన్‌ఐసీ పోర్టల్‌ ● నెలరోజుల నుంచి తీవ్రమైన సమస్య ● పట్టించుకోని ఎన్‌ఐసీ– సీడీఎంఏ

లభించని 2016కు ముందు

వివరాలు

పటమట(విజయవాడతూర్పు): జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం విజయవాడ నగరంలో పెద్ద ప్రహసనంగా మారింది. నెల రోజుల నుంచి సర్వర్‌ మొరాయించడంతో ఆయా పత్రాల కోసం ప్రజలు వార్డు సచివాలయాలు, మీ–సేవ కేంద్రాలు, నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం, ఇతర కోర్సుల్లో చేరిన విద్యార్థులు కచ్చితంగా జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని విద్యా శాఖ నుంచి సర్క్యులర్‌ జారీ అయ్యింది. సమయానికి ధ్రువీకరణ పత్రం సమర్పించకపోతే విద్యార్థుల భవిష్యత్‌ ఆ ప్రభావం పడుతుంది. సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై మునిసిపల్‌ శాఖ సీడీఎంఏ (కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో విజయవాడ నగర వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

నెలరోజుల నుంచి సర్వర్‌ డౌన్‌

నేషనల్‌ ఇన్ఫర్‌మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీడీఎంఏ విభాగం నుంచి యూబీడీ (యూనిఫైడ్‌ బర్త్‌ అండ్‌ డెత్‌) పోర్టల్‌ అనుసంధానంగా ఉంది. యూబీడీ నుంచి సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌)ద్వారా రాష్ట్రంలోని నగర పాలక, పురపాలక సంస్థల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను వార్డు సచివాలయం, మీ–సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో జారీ అవు తాయి. ప్రజలు ఆయా కేంద్రాల్లో కనీస రుసుం చెల్లించి సర్టిఫికెట్లు పొందుతారు. అయితే నెల రోజుల నుంచి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ఆగింది. ఇందుకు కారణం సర్వర్‌ డౌన్‌ అవ్వడమేనని, ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడ నగరంలో సగటున రోజుకు 70 నుంచి 100 వరకు జనన, మరణ ధ్రువపత్రాలు, ఆయా సర్టిఫికెట్లలో పేరు, తేదీ, చిరునామా మార్పు, లేదా ఇతర తప్పొప్పులను సరిచేసి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

శాఖల మధ్య సమన్వయ లోపం

కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఐసీ, రాష్ట్ర ప్రభుత్వ మునిసిపల్‌ శాఖ, వార్డు సచివాలయ విభాగం మధ్య సరైన సమన్వయం లేకపోవటంతో సమస్య పరిష్కారం కావటంలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్‌ఐసీ ఆధీనంలో ఉన్న సర్వర్‌ నిర్వహణపై ఆయా శాఖలు తమ పరిధి కాదంటే తమది కాదంటూ గాలికొదిలేశాయి. దీంతో ఇప్పుడు సర్వర్‌ మొరాయించటంతో ఆ ప్రభావం నగరవాసులపై పడింది. నెల రోజుల నుంచి సమస్య నెలకొన్న పరిష్కారం కోసం ఏ శాఖాధికారులు కూడా సక్రమంగా స్పందించకపోవటం శోచనీయం

1940 నుంచి 2016 డిసెంబర్‌ వరకు జనన, మరణ వివరాల డేటా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఐసీకి అప్పగించింది. అప్పట్లో విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి 16 లక్షల డేటా అప్‌లోడ్‌ చేశారు. అయితే అందులో కేవలం 50 వేల డేటా మాత్రమే వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా డేటాకు సంబంధించి తప్పొప్పులను సరి చేసుకునేందుకు మీ –సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే నగర పాలక సంస్థ స్టాటిస్టికల్‌ అధికారి వివరాలు పరిశీలించి అనుమతిస్తారు. నగర పాలక సంస్థలో అనుమతి పొందాలకు తిరిగి మీ–సేవ కేంద్రాల్లో ప్రింట్‌ తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాసెస్‌ ప్రస్తుతం ఆగిపోయింది. దీని వల్ల ఇటు ప్రభుత్వాదాయానికి గండి పడటంతోపాటు దరఖాస్తుదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2017 నుంచి నగరపాలక సంస్థ స్వయంగా డేటా సమీకరించ టంతో ఆయా వివరాలు సర్వర్‌లో కనిపిస్తున్నాయని, అయితే ప్రింట్‌ మాత్రం రావటంలేదని సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement