హత్య కేసు ఛేదించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసు ఛేదించిన పోలీసులు

Sep 28 2026 7:33 AM | Updated on Sep 28 2026 7:33 AM

ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌ల్లో శరీర అవయవాలు తొలగించి.. లభించిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో భవానీపురానికి చెందిన నిందితుడు షేక్‌ షఫీని అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్‌జోన్‌ ఏసీపీ దుర్గారావు హత్యకు కారణాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 18న కాలువలో మహిళ మృత దేహం స్వాధీనం చేసుకున్న క్రమంలో సీపీ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారన్నారు. ఆసుపత్రులు, టాటూ సెంటర్‌లు, టోల్‌గేట్ల వద్ద సీసీ కెమేరాల పుటేజీలు, పత్రికలు, సోషల్‌ మీడియా వేదికగా మృతురాలి శరీరంపై దుస్తులు, చేతిపై నెమలి పించం టాటూ ప్రచారం చేసి మృతురాలిని గుర్తించినట్లు చెప్పారు.

సోదరుడు ఇచ్చిన సమాచారంతో..

ఆ ఆధారాలతో ఆమె సోదరుడు తన అక్కగా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమె మంగళగిరి ప్రాంతానికి చెందిన కర్రి దుర్గ ఆలియాస్‌ కళ్యాణిగా గుర్తించినట్లు తెలిపారు. సమగ్ర విచారణలో ఆమె స్వస్థలం ఏలూరు జిల్లా కలిదిండి మండలం తాటినాడ గ్రామంగా గుర్తించారు. ఆమె మంగళగిరిలోని ఓ హోటల్లో పనిచేస్తూ గౌస్‌ మొహిద్దీన్‌తో సహజీవనం చేసి ఒక బాబుకి జన్మనిచ్చినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. గౌస్‌ మొహిద్దీన్‌కు ముందుగానే వివాహం అవడంతో అతనికి దూరమై భవానీపురం హెచ్‌బీ కాలనీకి చెందిన మటన్‌ దుకాణం యజమాని షేక్‌ షఫీతో పరిచయం పెంచుకుంది. ఆమె కుమారుడిని కూడా అతని వద్దే ఉంచి సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 17 షఫీతో డబ్బులు వ్యవహారంలో వివాదం రావడంతో ఆమెను వదిలించుకోవాలనే పక్కా ప్రణాళికతో కుటుంబ సభ్యులను ఊరికి పంపించి కళ్యాణిని ఇంటికి పిలిపించాడు.

మటన్‌ కొట్టే కత్తితో..

మటన్‌ కొట్టే కత్తితో దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు. తన మిత్రుడు షేక్‌ అబ్దుల్లా(దుర్గారావు)తో కలిసి ఆమె తల, కాళ్లు, చేతులు వేరు చేసి సంచిలో వేసుకుని బైక్‌పై వెళ్లి ఎన్టీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్లో పడేశారు. సమగ్ర విచారణలో భాగంగా సీఐ సుబ్రహ్మణ్యం భవానీపురంలో ఉన్న నిందితుడు షేక్‌ షఫీని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ దుర్గారావు తెలిపారు. మరో నిందితుడు షేక్‌ అబ్దుల్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మరో నిందితుడు అబ్దులా కోసం గాలిపు చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్‌ఐ సేనాపతి శ్రీనివాసరావు, ఎస్‌ఐలు రవివర్మ, సత్యవతి, చక్రధర్‌, సన్యాసి నాయుడిని సీపీ రాజశేఖర్‌బాబు అభినందించినట్లు ఏసీపీ దుర్గారావు పేర్కొన్నారు.

నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement