పెనుగంచిప్రోలు: మునేరుపై పోలంపల్లి వద్ద ఆనకట్ట ఆధునికీకరణకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయకపోతే పదవికి రాజీనామా చేస్తానని మునేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొన్నం బాలాజీ అన్నారు. ఆదివారం పెనుగంచిప్రోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలంపల్లి వద్ద మునేరు ఆనకట్ట వద్ద నుంచి సుమారుగా 30 వేల ఎకరాలు సాగు అవుతోందన్నారు. వరదలకు పాత ఆనకట్ట పాడవటం, కొత్త ఆనకట్ట పక్క గండ్లు పడి నీరు నిల్వ ఉండే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇప్పటి వరకు తాత్కాలిక మరమ్మతుల కోసం తాను సొంతగా రూ.15 లక్షల వరకు ఖర్చు చేశానని తెలిపారు. పోలంపల్లి డ్యాం తాత్కాలిక మరమ్మతులతో పాటు శాశ్వత పరిష్కారం కోసం మొత్తం రూ.30 కోట్లు అవసరం ఉందన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తక్షణం నిధులు మంజూరు చేసి ఆదుకోకపోతే ఆయకట్టున 30 వేల ఎకరాల్లో సాగు నీరు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు. గండ్లు పడి తెలంగాణ ప్రాంత రైతుల పొలాలు సుమారుగా 45 ఎకరాలు కోతకు గురి కావటంతో ప్రతి ఏడాది వారికి కౌలు కట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా తక్షణం నిధులు మంజూరు చేసి రైతాంగాన్ని అదుకోవాలన్నారు. రెండు నెలల్లో నిధులు మంజూరు కాకపోతే తనతో పాటు మునేరు ప్రాజెక్టు నీటి సంఘాల అధ్యక్షులు అందరూ పదవులకు రాజీనామా చేస్తారన్నారు. సమావేశంలో ముచ్చింతాల నీటిసంఘం చైర్మన్ పద్మాల వెంకటేశ్వరరావు, కొండూరు నీటి సంఘం అధ్యక్షులు దేవినేని శ్రీనివాసరావు, రైతు నాయకులు తోట నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
మునేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్
పొన్నం బాలాజీ


