అప్రమత్తమైన యంత్రాంగం నమోదు కాని కొత్త కేసులు పారిశుద్ధ్య చర్యలపై దృష్టి సారించిన అధికారులు
కంకిపాడు: డయేరియా కలకలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉప్పలూరులో ఇంటింటి సర్వేను కొనసాగిస్తున్నారు. ప్రత్యేక బృందాలు గ్రామంలో పర్యటించి ప్రజల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీస్తున్నాయి. నిన్నటివరకూ పారిశుద్ధ్య చర్యలపై కన్నెత్తి చూడని అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్యం మెరుగునకు అవసరమైన క్షేత్రస్థాయి చర్యలు చేపడుతున్నారు. ఉప్పలూరులో శుక్రవారం కొత్తగా డయేరియా కేసులు ఏవీ అధికారికంగా నమోదు కాలేదు. దీంతో జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఉప్పలూరు పీహెచ్‌సీ పరిధిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిపై వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ గ్రామంలో పర్యటించారు. ఇంటింటి సర్వే తీరును పరిశీలించారు. ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, నీరు నిల్వ ఉండకుండా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో వైద్యాధికారి డాక్టర్ అంజు, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరావు, పీహెచ్‌ఎన్ రాజమణి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
హడావుడిగా పారిశుద్ధ్య పనులు
డయేరియా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు హడావుడిగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని పలు కాలనీల వద్ద పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించారు. డ్రెయిన్లలో నిలిచిపోయిన వ్యర్థాల తొలగింపు చేపట్టారు. పారిశుద్ధ్య పనులను ఎంపీడీఓ నిమ్మగడ్డ బసవయ్య తనిఖీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.


