నేడు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం ఆలయ అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం కీలకమైన దసరా ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో బోర్డు ముందుకు పలు కీలక అంశాలు నూతన అన్నదాన భవన ప్రారంభం సందర్భంగా విభేదాలు సమావేశానికి హాజరయిన బోర్డు సభ్యుడిని బయటకు పంపిన ఘటన అవసరమైతే సమావేశాన్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం గురువారం వాడిగా వేడిగా జరిగే అవకాశం కనపడుతోంది. దసరా ఉత్సవాలకు ముందు జరిగే ఈ కీలక ఈ సమావేశం అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దుర్గగుడి చైర్మన్‌తో పాటు ఆలయ అధికారులకు, ట్రస్ట్ బోర్డు సభ్యుల మధ్య వ్యవహారాలు గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా మారాయి. ట్రస్ట్ బోర్డు సమావేశానికి వచ్చే అజెండాలను ఆమోదించాలని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, బుధవారం సాయంత్రం ట్రస్ట్ బోర్డు సభ్యులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఏదైనా బోర్డు సమావేశంలోనే తేల్చుకుందామని బోర్డు సభ్యులు కరాకండిగా తేల్చి చెప్పేశారు. దేవస్థానానికి చెందిన కొంత మంది అధికారుల తీరే దీనికి కారణమని ట్రస్ట్ బోర్డు సభ్యులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులంటే కేవలం ఆలయ అధికారులు చేసిన ప్రతిపాదనలను ఆమోదించడానికే ఉన్నామా అని ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన ఏ అంశాన్నైనా ప్రశ్నిస్తే వారికి నచ్చడం లేదని తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయానికి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తించి ఆ విభాగం అధికారికి తెలిపినా ప్రయోజనం ఉండటం లేదంటున్నారు. మరో వైపు గత నెల 21వ తేదీన జరిగిన నూతన అన్నదాన భవనం, లడ్డూ పోటు భవనాల ప్రారంభోత్సవం, అంతకు ముందు అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని తమ దృష్టికి తీసుకురాకపోవడంతో వారు గుర్రుగా ఉన్నారు. సీనియర్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, కూటమి పక్షాలకు చెందిన కొందరు ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై బుధవారం తమ పశ్చిమ నియోజకవర్గ ప్రజా ప్రతినిధితో సైతం బోర్డు సభ్యులు చర్చించినట్లు తెలిసింది.
ప్రతిపాదనల ఆమోదానికేనా?
ట్రస్ట్ బోర్డు కేవలం దేవస్థానం చేసిన ఖర్చులు, ప్రతిపాదనలను ఆమోదించడానికే ఉందా అని పలువురు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు ఇప్పటికే ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యుల ముందు ఉంచారు. అయితే వాటికి సంబంధించి ఏయే పనులకు ఖర్చు ఎంత మొత్తం చేస్తున్నారని వారు ఆరా తీస్తారు. తాము కేవలం ఆలయ ఈవోకు మాత్రమే ప్రతిపాదనల గురించి చెప్పుకుంటామని, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏదైనా అడగాల్సి ఉంటే నేరుగా ఈవోను అడిగి తెలుసుకోవాలని బహిరంగంగా చెప్పడంతో ఆ సమావేశంలో ఉన్న సభ్యులు అవాక్కయ్యారు.
ముందు చర్చ.. ఆ తర్వాతే అజెండా
గురువారం జరిగే సమావేశంలో ముందు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే అజెండాపై చర్చించాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. కొంత మంది ఆలయ ఉద్యోగులు, సిబ్బంది కనీసం బోర్డు సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు పేర్కొంటున్నారు. నేటి సమావేశంలో దసరా ఉత్సవాల ప్రతిపాదనలను ఆలయ అధికారులు సభ్యుల ముందు ఉంచుతున్నారు. తమకు సంతృప్తికరమైన సమాధానం వచ్చిన తర్వాతే అజెండాను ముందుకు తీసుకువెళ్లామని, అవసరమయితే రాత్రి 10 గంటలైనా బోర్డు సమావేశం కొనసాగిస్తామని సభ్యులు పేర్కొంటున్నారు.
మహామండపం నాల్గో అంతస్తులో దేవస్థానం గత నెల 27వ తేదీన నూతనంగా సమావేశ మందిరాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆహ్వానం లేదు. ఆ రోజు ఉదయం 10.30గంటల సమయంలో ట్రస్ట్ బోర్డు కార్యాలయంలో ఉన్న ఇద్దరు, ముగ్గురు సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. అదీ కూడా ప్రారంభోత్సవానికి పది నిమిషాల ముందు సమాచారం ఇవ్వడంపై వివాదం చోటు చేసుకుంది. ఇదే అంశంపై గురువారం జరిగే సమావేశంలో మిగిలిన సభ్యులు ఆలయ అధికారులను నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు నిపుణులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు వస్తున్నారనే సమా చారం కూడా ఇవ్వడం లేదనేది ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆరోపణ. అధికారులకు ఒక రోజు ముందే ఆయా అధికారుల పర్యటన, పనుల పరిశీలన సమాచారం ఉన్నా.. ఎందుకు ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఇవ్వడం లేదో ఈ సమావేశంలో నిగ్గు తేల్చుకుంటామని వారు చెబుతున్నారు. గత నెల 21న ఆలయ ప్రాంగణంలోని రూ.కోట్లతో నిర్మించిన అన్నదాన భవనం, ప్రసాదాల పోటు ప్రారంభోత్సవానికి కనీసం డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కు ఆహ్వాన పత్రికను అందజేయకపోవడంపై ఆ పార్టీకి చెందిన సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక 28వ తేదీన నూతన సమావేశ మందిరంలో దేవస్థాన ఈవో, ఆలయ అధికారులతో జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా ట్రస్ట్ బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీరా సమావేశానికి హాజరైన సీనియర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిని ఆలయ అధికారి సిబ్బంది ముందే బయటకు పంపడాన్ని ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఇదే అంశాన్ని తోటి సభ్యులకు వాట్సాప్ ద్వారా పంచుకొని ఆవేదన చెందిన ఘటన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.


