విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
● అర్హులందరికీ న్యాయం చేయాలని చేనేత కార్మికుల డిమాండ్
పెడన: ‘నేతన్నకు సేవలో’ పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వం అర్హులకు మొండిచేయి చూపింది. తెలుగు తమ్ముళ్ల సిఫార్సులకే పెద్దపీట వేసి అనర్హులకు లబ్ధి చేకూర్చింది. ఎన్నికల సమయంలో నేత కార్మికుల ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్ర బాబుతో పాటు కూటమి పార్టీల నాయకులంతా ‘నేతన్న నేస్తం’ పథకానికి మించి సాయం చేస్తామంటూ హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని విస్మరించారు. రెండేళ్లు ఎదురు చూసిన చేనేత కార్మికులు కడుపుమండి రోడ్డెక్కడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ‘నేతన్న సేవలో’ అంటూ పథకం పేరు మార్చి కుటుంబానికి రూ.25 వేలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పింది. అయితే అరకొరగా నిధులు విడుదల చేసింది. ఆ నిధుల్లోనూ అర్హులకు అరకొరగా ఇచ్చి, తమ పార్టీ నాయకులు సూచించిన వారికి మగ్గం లేకున్నా, ఇతర వృత్తుల్లో ఉన్నా లబ్ధిచేకూర్చింది. దీంతో అర్హులైన చేనేత కార్మికులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో పారదర్శకంగా..
చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘నేతన్న నేస్తం’ పథకం తీసుకొచ్చారు. ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబా నికి ఏడాదికి రూ.24 వేల చొప్పున క్రమం తప్ప కుండా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. 4,832 మంది కుటుంబాలకు మేలు జరిగింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పథకం అమలుచేసి ఆదుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగింది. సచివాలయ సిబ్బంది చేనేతల ఇళ్ల వద్దకు వెళ్లి జియోట్యాగింగ్ చేసి ఆ తర్వాత అర్హుల పేర్లు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేసి జాబితా రూపొందించారు. ఈ జాబితాలను సచివాలయాల వద్ద ప్రదర్శించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఫలితంగా అర్హులు అందరికీ ఈ పథకం కింద లబ్ధిచేకూరింది.
ఇప్పుడు సిఫార్సులు ఉంటేనే..
చంద్రబాబు ప్రభుత్వంలో నేతన్న సేవలో పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు హడా వుడిగా పూర్తి చేశారు. చేనేత, జౌళి శాఖ అధికారులు కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి గప్‌చిప్‌గా దరఖాస్తులను స్వీకరించారు. ఎటువంటి విచారణ లేకుండానే కూటమి నాయకులు చెప్పిన పేర్లతో జాబితాలక రూపొందించారు. ఈ జాబితాలను ఎక్కడా వెల్లడించలేదు. మగ్గం లేని, ఇతర వృత్తుల్లో ఉన్న వారికి సైతం లబ్ధిచేకూర్చారు. 4,393 మందితో జాబితా రూపొందించారు. వీరిలో 215 మందికి వివిధ కారణాలతో పథకం వర్తింప జేయలేదు. మిగిలిన వారికి ఆగస్టు ఏడో తేదీన రూ.25 వేల చొప్పున సాయం అందించారు. అయితే ఒకే ఇంటిలో ముగ్గురికి పథకం వర్తింపజేయడం, మెకానిక్‌లను కూడా అర్హులుగా గుర్తించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కూటమి నాయకులు అనర్హులకు లబ్ధి చేకూర్చి, వారి వద్ద వాటాలు దండుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో మరోసారి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మరో 1,072 మందికి లబ్ధి చేకూరుస్తామని వెల్లడించారు.
నేను పుట్టి పెరిగింది పెడనలోనే. బతుకుదెరువు కోసం 12 ఏళ్ల క్రితం చీరాల వెళ్లాం. అక్కడ కూడా పరిస్థితి బాగోలేక తిరిగి పెడన వచ్చి ఆరేళ్లు గడిచాయి. ఆధార్‌కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇక్కడకు మార్పించుకున్నాం. మగ్గంపైనే ఆధారపడి బతుకుతున్నాం. నేనూ, నా భార్య నాగేశ్వరకుమారి మగ్గం నేస్తున్నాం. దరఖాస్తు చేసినా పథకం వర్తింపజేయలేదు. డబ్బులు ఎప్పుడు పడతాయా అని రోజూ బ్యాంక్‌కు వెళ్లి ఆరాతీస్తున్నాం.
– ఉటుకూరి నాగవెంకటేశ్వరరావు, పోలవరపు పేట, పెడన
నేతన్న సేవలో పథకం వర్తించలేదు. 50 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. నాకు చేనేత గుర్తింపు కార్డు కూడా ఉంది. అయినా పథకం వర్తింపజేయలేదు. అర్హత ఉన్నా అన్యాయం చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారొచ్చి ఫొటోలు తీసుకువెళ్లారు. అయినా పథకం రాలేదు. అద్దె ఇంట్లో ఉంటూ నేత నేసుకుంటున్నాం. పథకం వర్తింపజేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాం.
– పేరిశెట్టి రుక్మిణి, పోలవరపు పేట, పెడన
నేతన్న సేవలో పథకంలో మొదట 4,393 మంది అర్హులను గుర్తించాం. వారిలో 215 మందికి ఆధార్, సాంకేతిక కారణాలతో లబ్ధిచేకూరలేదు. రెండో సారి మరో 1,072 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాం. 215 మందితో పాటు 1,072 మందికి కూడా త్వరలోనే నగదు జమ అవుతుంది. ఇంకా వీరి నగదు విడుదల కాలేదు. అనర్హులు ఉన్నారని లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా వారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటాం.
– సీహెచ్ విజయ్‌బాబు,
చేనేత, జౌళిశాఖ ఏడీ, మచిలీపట్నం


