ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం తగదని అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. గ్రీవెన్స్ పరిష్కారంలో జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేందుకు కృషిచేయాలని కోరారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యను వాస్తవంగా పరిష్కరించారా? వారు సంతృప్తి చెందారా? అనేదే కీలకమన్నారు. ఆర్డీఓలు, తహసీ ల్దార్లు, సర్వేయర్లు అర్జీలను కేవలం కార్యాలయ స్థాయిలో పరిశీలించకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలపై ఆరా తీయాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలు సుకుని, నిబంధనల మేరకు న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రత్యేకించి జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, వాటి పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మొత్తం 161 అర్జీలు
జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యల పరిష్కారం కోసం 161 అర్జీలు వచ్చాయని అధికా రులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 46, పోలీస్ 23, పురపాలక పట్టణ అభివృద్ధి 23, పంచాయతీరాజ్ శాఖకు 10, మిగిలిన శాఖలకు సంబంధించి అర్జీలు వచ్చాయని వివరించారు.
స్వచ్ఛాంధ్రలో జిల్లా మెరవాలి
స్వచ్ఛాంధ్ర–2026లో ఎన్టీఆర్ జిల్లాకు ఎక్కువ అవార్డులు వచ్చేలా అధికారులు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ప్రతి శాఖ, స్థానిక సంస్థ తమ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, వాటి ఫలితాలను స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


