ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.1.20 లక్షల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. సత్యనారాయణపురానికి చెందిన ఉపద్రష్ట శ్రీనివాస్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, డీఈఓ కిషోర్‌కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన ఐసెట్‌లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో సోమవారం మొదలైంది. ఎన్‌సీసీ–22, దివ్యాంగులు–20, సీఏపీ–11, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–5, స్కౌట్స్ అండ్ గైడ్స్–1 చొప్పున మొత్తం 59 మంది సర్టిఫికెట్లను పరిశీలించామని హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్–10001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఆంగ్లో ఇండియన్స్ కేటగిరీలో ఒకటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరి శీలిస్తామని వివరించారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): గంజాయి సంస్కృతిని సమూలంగా నిర్మూలించడంతో పాటు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌ల భయాలను తొలగించి ఎన్టీఆర్ జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చడమే ధ్యేయమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ, గంజాయి సమూల నిర్మూలనకు తీసుకొచ్చిన మూడు ప్రత్యేక ప్రచార రథాలు, ప్రచార గుర్రాలను తన కార్యాలయం వద్ద ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, ఈగల్ చాలెంజ్‌లపై వినూత్నరీతిలో అవగాహన కోసం డిజిటల్ స్క్రీన్లు కలిగిన మూడు ప్రచార రథాలు వారం రోజులు నగర వ్యాప్తంగా తిరుగుతాయన్నారు. గుట్టలు, కొండ ప్రాంతాల్లో అవగాహన కోసం గుర్రాలను, మెక్ అనౌన్స్ మెంట్ సౌకర్యం ఉన్న అత్యాధునిక మాట్రిస్ 4టీ డ్రోన్ల ద్వారా విస్తృత ప్రచారంచేస్తామ న్నారు. గంజాయి విక్రేతల సమాచారమందిస్తే రూ.5 వేలు, వినియోగదారుల సమాచారం తెలిపితే రూ.1500 బహుమతిగా ఇస్తామన్నారు. ఇప్పటికే గంజాయి విక్రయదారులపై తీవ్ర చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 32 మందిపై పీఐటీ ఎన్‌డీపీఎస్ యాక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. 15 వేల మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించి, 1,287 మంది వినియోగదారులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, డాక్టర్ కె.తిరుమలేశ్వర రెడ్డి, కె.జి.వి.సరిత, కె.కృష్ణ ప్రసన్న, జి.రామకృష్ణ, ఏసీపీ దామోదర్, ఇన్‌స్పెక్టర్ గుణరాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం
గన్నవరం: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి సోమవారం నాలుగు గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఐఎక్స్ 2875 విమానం షెడ్యూల్ ప్రకారం రోజూ బెంగళూరు నుంచి ఉదయం 6.15గంట లకు బయలుదేరి 7.35లకు ఇక్కడికి చేరుకుంటుంది. అయితే సాంకేతిక కారణాల వల్ల విమానం సుమారు ఐదు గంటల ఆలస్యంగా బయలుదేరి 12.38 గంటలకు ఇక్కడికి చేరు కుంది. విమానం ఆలస్యం కావడంతో బెంగ ళూరు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లో నిరీక్షించాల్సి వచ్చింది.


