వందల మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలతో విశేష గుర్తింపు 50 ఏళ్లుగా నృత్య సేవలో వేదాంతం పార్థసారథి
రూపకాలతో కొత్త ఒరవడి
నృత్యానికి సొబగులద్దిన
వేదాంతం
పార్థసారథి
విజయవాడ కల్చరల్: కూచిపూడి నృత్యమంటే కేవలం అడుగులు, అభినయం కాదు. తరతరాలుగా వస్తున్న తెలుగు సంస్కృతికి సజీవ రూపం అంటూ ఆ నృత్య సంప్రదాయానికి సరి కొత్త సొబగులు అద్దిన నాట్యాచార్యుడు వేదాంతం పార్థసారథి. ఆ సంప్రదాయాన్ని భుజాన వేసుకొని దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వందలాది మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. నగరానికి నృత్యాన్ని వృత్తిలా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తూ, శాసీ్త్రయతకు పెద్దపీట వేస్తూ తనదైన శైలిలో పార్థసారథి అర్ధ శతాబ్దంగా కూచిపూడికి నృత్య సేవలు అందిస్తున్నారు. పార్థసారథి సోదరులు వేదాంతం రాధేశ్యాం, వేదాతం రామలింగశాస్త్రి, వేదాంతం పాండు రంగ శర్మ, వారి కుమారులు అందరూ కూచిపూడి నృత్యనికే అంకితమయ్యారు.
గురువుల చెంత నేర్చుకొని..
వేదాంతం పార్థసారథి చిన్ననాటి నుంచే కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. వేదాంతం కుటుంబంలో కొనసాగుతున్న నృత్య సంప్రదాయాన్ని అందిపుచ్చుకొని కఠోర శ్రమతో సాధన సాగించారు. తండ్రి వేదాంతం సూర్యనారాయణ శర్మ వద్ద తొలి అడుగులు నేర్చుకున్నారు. వెంపటి చినసత్యం, వేదాంతం పార్వతీశం వంటి గురువుల శిక్షణ ఆయనకు బలమైన పునాదిగా మారింది. వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ స్థాపించి సంప్రదాయ కూచిపూడిలో శిక్షణ నిస్తున్నారు.
సంప్రదాయ నృత్యాలు భారతీయ ఆత్మ
సంప్రదాయ నృత్యాలను భారతీయ ఆత్మగా భావించాలని వేదాంతం పార్థసారథి సూచించారు. కూచిపూడి నృత్యం, భరతనాట్యం, కథక్, కథాకళీ, ఒడిస్సీ వంటి సంప్రదాయాలు ఏవైనా గురుముఖంగానే పరిపక్వత కలుగుతాయని పేర్కొన్నారు.
కూచిపూడి నృత్యాన్ని సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయాలంటే నృత్య రూపకాలది ప్రత్యేక స్థానం. బృందావనం, భక్త ప్రహ్లాద, గిరిజా కల్యాణం, వాగ్గేయకార రచనా వైభవం, అన్నమయ్య, రామదాసు వంటి నృత్య రూపకాలను పార్థసారథి రూపొందించారు. పురాణ భక్తి సాహిత్య ఇతివృత్తాలను నృత్యభాషలో అందంగా రూపొందించడం ఆయన ప్రత్యేకత. కళలకు స రిహద్దులు లేనట్లుగా తన బృందంతో శ్రీలంక, మలేషియా వంటి దేశాలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెండువేలకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.


