ఇబ్రహీంపట్నం: అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన కంకరు, బూడిద, గ్రావెల్ జల రవాణా ద్వారా సరఫరా చేసే పంటు ఇసుక మేటలు అడ్డొచ్చి నిలిచిపోయింది. పది లారీలు బూడిద, కంకర సామగ్రితో సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెం వద్దకు బయలు దేరింది. పట్టిసీమ కాలువ ద్వారా వస్తున్న నీటితో నదిలో ఇసుక మేటలు మధ్య పంటు నీటిలో ఇరుక్కుపోయింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. రెండు రోజులుగా పంటు రవాణా నిలిచి పోవడంతో లారీల రాకపోకలు వెస్ట్ బైపాస్ మీదుగా అమరావతి ప్రాంతానికి మెటీరియల్ రవాణా చేపట్టారు. నదిలో చిక్కుకున్న పంటును డ్రెడ్జింగ్ యంత్రాల ద్వారా తీసేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక రమేష్ ఆస్పత్రి రోడ్డులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా) కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాఘర్ ఆడిటోరియంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్‌ఎంఈ–డీసీ, ఇండియా ఎస్‌ఎంఈ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ గ్రోత్‌పై వర్క్‌షాప్ బుధవారం జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు, నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంఎస్‌ఎంఈ ఈడీ సుధాకర్‌తో పాటుగా జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి చీరాలకు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. చీరాల కొత్తపేటకు చెందిన ఎం. నాగేశ్వరరావు కుటుంబ సభ్యు లు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రానున్న పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించే చర్యలో భాగంగా ఎక్కువ డిమాండ్ ఉన్న లింగంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్‌లో పెరగనున్న రద్దీని తగ్గించే దిశగా హైటెక్ సిటీ స్టేషన్‌లో తాత్కాలిక హాల్టింగ్ కల్పిస్తూ రైల్వేశాఖ ప్రకటించింది. దీని ప్రకారం దసరా, దీపావళి పండుగ సీజన్‌లో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 11 వరకు (15 రోజులు), అదే విధంగా క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సీజన్‌లు డిసెంబర్ 18 నుంచి 2027 జనవరి 19 వరకు (33 రోజులు) హైటెక్ సిటీలో తాత్కాలిక హాల్టింగ్ ఉంటుందన్నారు.
హైటెక్ సిటీలో ఆగే రైళ్లు ఇవే..
●నర్సాపూర్–లింగంపల్లి (17255) ఆయా రోజుల్లో ప్రతి రోజు ఉదయం 4.45కి హైటెక్ సిటీ చేరుకుని 4.46కి బయలుదేరుతుంది. అదే విధంగా లింగంపల్లి–నర్సాపూర్(17256) రాత్రి 9.08కి చేరుకుని 9.09కి బయలుదేరుతుంది.
● కాకినాడ టౌన్–లింగంపల్లి(12775) ఉదయం 7.10కి చేరుకుని 7.11కి బయలుదేరుతుంది. లింగంపల్లి–కాకినాడ టౌన్(12776) రాత్రి 7.08కి హైటెక్ సిటీ చేరుకుని 7.09కి బయలుదేరుతుంది.


