న్యూస్‌రీల్
మిగిలిపోయిన సీట్ల వివరాలు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభావం..
కేవలం ఎనిమిది కళాశాలల్లోనే..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేశంలో కొన్నాళ్ల వరకూ ఉన్నత విద్య అంటే అది బీటెక్ మాత్రమే. అదొక్కటే మార్గం అన్నట్లుగా భావించే వారు. అయితే రానురాను ఇంజినీరింగ్‌పై విద్యార్థులకు ఆసక్తి సన్నగిల్లుతోంది. అందుకు ఈ ఏడాది భర్తీ అయిన సీట్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ ఏడాది మొదటి విడతగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఇంజినీరింగ్ సీట్లు 40 శాతానికి పైగా మిగిలిపోయాయి. రాష్ట్రంలోనే విద్యా కేంద్రంగా ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే ఈ పరిస్థితి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వం ఇటీవల ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా ఉండటం, కళాశాలల యాజమాన్యాలు ఫీజులు గురించి వేధించటం వంటి కార ణాలతో సీట్ల భర్తీపై సందిగ్ధత నెలకొంది. మేనేజమెంట్ సీట్లకు సంబంధించి సైతం చాలా కళాశాలల్లో సీట్లు భర్తీ కాకపోవటంతో ఆయా యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. చివరి దశ కౌన్సెలింగ్ ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన దాని వల్ల ఉపయోగం ఏమీ ఉండకపోవచ్చని కళాశాలల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
భర్తీ అయిన సీట్లలోనూ అధిక శాతం కంప్యూటర్స్ రంగం, దాని అనుబంధ రంగాలకు చెందిన కోర్సులకు చెందినవే ఉన్నాయి. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన కోర్సులకు చెందిన సీట్లు 75శాతం భర్తీ అయ్యాయి. అలాగే ఐటీ రంగానికి చెందిన పలు కోర్సులకు సైతం ఇటీవల డిమాండ్ పెరిగింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి రంగాలకు చెందిన కోర్సులకు సైతం డిమాండ్ పెరగటంతో ఆయా సీట్లు భర్తీ అయినట్లు తెలిసింది. అదేవిధంగా చాలా కళాశాలల్లో ఈ రంగానికి చెందిన సీట్లే అధికంగా ఉండటంతో వాటిపైనే దృష్టి పెట్టి యాజమాన్యాలు భర్తీ చేసుకున్నాయి.
ఇంజినీరింగ్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బ్రాంచ్‌లు మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్. కానీ అవి ఇప్పుడు మరీ తీసికట్టుగా మారాయి. కంప్యూటర్స్ తరువాత ఎలక్ట్రానిక్స్ కొద్ది మేర ఫర్వాలేదనిపిస్తున్నా ప్రముఖ కళాశాలల్లో మాత్రమే వాటిల్లో చేరికలు కనిపించాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి అవకాశాలు పూర్తిగా పడిపోయాయని విద్యార్థి సంఘాలు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు ఉపాధి అవకాశాలపై పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నప్పటికీ కాగ్, నీతీ అయోగ్, ఎంపీలు పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలకు వస్తున్న సమాధానాలు తదితర నివేదికలు పరిశీలించటం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా పడిపోయాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల సైతం ఇంజినీరింగ్ కోర్సుల్లో విద్యార్థులు చేరటానికి ముందుకు రావటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 30 ఇంజినీరింగ్ విద్యను బోధించే విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అందులో మూడు విశ్వవిద్యాలయాలు కాగా 26 కళాశాలలుగా ఉన్నాయి. వాటిల్లో చేరటానికి ఈ నెల 15వ తేదీ వరకూ మొదటి విడతకు సంబంధించి అవకాశం కల్పించారు. ఉమ్మడి కృష్ణాజల్లాలో కన్వీనర్ కోటాలో 14,243 సీట్లు ఉండగా అందులో 9,921 సీట్లు మాత్రమే అలాట్‌మెంట్ జరిగాయి. సుమారు 4,322 సీట్లు మిగిలిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా అలాట్‌మెంట్ అయిన సీట్లలో మరో పది శాతం వరకూ విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదని అధికారులు వివరిస్తున్నారు.
ఇంజినీరింగ్ సీట్ల భర్తీపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభావం పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను పెంచిన విషయం తెలిసిందే. కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులు దారిద్య్రరేఖకు దిగువన ఉంటే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. కానీ రాష్ట్రంలో ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవటంతో కళాశాలలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా కోర్సుల్లో చేర్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో భారీగా
మిగిలిన కన్వీనర్ కోటా సీట్లు
మొత్తం 30 ఇంజినీరింగ్ కళాశాలలు
అందుబాటులో మొత్తం 19వేల సీట్లు
కన్వీనర్ కోటాలో ఉన్నవి 14వేలు
అందులో భర్తీ కాని సీట్లు
40శాతం పైనే
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు
వైఖరే ప్రధాన కారణం!
ఉమ్మడి జిల్లాలో 26 ఇంజి నీరింగ్ కళాశాలలను కౌన్సెలింగ్ ప్రక్రియలో చూపిస్తున్నారు. అందులో కేవలం ఎనిమిది విద్యాసంస్థల్లో మాత్రమే 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయినట్లుగా నివేదికలు వివరిస్తున్నాయి. మిగిలిన 18 ఇంజినీరింగ్ కళాశాలల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరో పది కళాశాలల్లో కనీసం 50 శాతానికి సైతం చేరికలు లేవు. కంప్యూటర్ కోర్సులతో కలిపినా సగానికి పైగా సీట్లు నిండకపోవటంపై సర్వత్రా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


