ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం ఎదుట కళావేదికపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు కల్యాణం జరిపించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారి కల్యాణం జరిగింది. అనంతరం కల్యాణ తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు. కల్యాణోత్సవంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం కల్యాణ వేదిక నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా స్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల అమలులో జిల్లా ముందుండాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ. శ్రావణ్‌కుమార్ అన్నారు. ముఖ్యమైన సూచనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. జిల్లాలోని పీహెచ్‌సీ వైద్యాధికారులు, ప్రోగ్రామ్ అధికారులు డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రావణ్‌కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ ఆధారిత హాజరు, సిబ్బంది సెలవులు అప్లోడ్ చేసే విధానం నూటికి నూరు శాతం జరగాలన్నారు. జూనియర్ డాక్టర్ సమ్మె సందర్భంగా, డ్యూటీ వేసిన డాక్టర్లు తప్పనిసరిగా, బుధవారం ఉదయం 9 గంటలకల్లా జీజీహెచ్ సూపరింటెండెంట్‌కి రిపోర్టు చేయాలన్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లా టూరిజం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (అదనపు బాధ్యతలు)గా డాక్టర్ కొల్లేటి రమేష్‌ని నియమిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ కొల్లేటి రమేష్‌కు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీషర్‌గా అదనపు బాధ్యతలు కేటాయించారు.


