చిత్రప్రయాణం | - | Sakshi
Sakshi News home page

చిత్రప్రయాణం

Aug 19 2026 1:53 AM | Updated on Aug 19 2026 1:53 AM

చిత్రప్రయాణం క్లిక్‌ ఇవ్వని కిక్‌.. పాత కెమెరా ఇస్తోంది!

కెమెరామేన్‌ ప్రసాద్‌తో
క్లిక్‌ ఇవ్వని కిక్‌.. పాత కెమెరా ఇస్తోంది!

ఆయన ఇల్లు ఓ కెమెరా మ్యూజియం! 1970 నాటి కెమెరా నుంచి నేటి అత్యాధునిక కెమెరాల వరకూ విభిన్న మోడల్స్‌ ఆయన వద్ద కనిపిస్తాయి. ఆయన వృత్తి ఫొటోగ్రఫీ అయినా.. కెమెరాల సేకరణను ఒక హాబీగా మార్చుకొని దాదాపు 170 పాతతరం కెమెరాలను తన ఇంట్లోని ఓ గదిలో భద్రపరిచాడు. దేశ విదేశాలకు చెందిన అతి పురాతనమైన కెమెరాలు సైతం తన కలెక్షన్‌లో ఉన్నాయి. ఆయనే విజయవాడకు చెందిన పొట్లూరి ప్రసాద్‌. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆ ‘మ్యూజియాన్ని’ కెమెరామేన్‌ ప్రసాద్‌తో కలిసి సై‘లెన్స్‌’తో చూసొద్దాం రండి.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కంటితో సైతం చూడలేని చిత్రాలను కెమెరా ‘క్లిక్‌’లో చూపించడం ఫొటోగ్రాఫర్ల ప్రత్యేకత.. కానీ విజయవాడకు చెందిన పొట్లూరి ప్రసాద్‌ అక్కడితే ఆగిపోలేదు. కేవలం ఫొటోలు తీయడమే కాదు దేశవిదేశాలకు చెందిన అతి పురాతనమైన కెమెరాలను సేకరించడం అలవాటుగా చేసుకొని ముందుకు సాగుతున్నాడు. 1984లో కెమెరాను కొనాలనే ఆశతో మొదలైన అతని హాబీ ఫొటో కెమెరాల సేకరణ వైపు మళ్లింది.

సేకరించిన కెమెరాలకు ఒక గది..

కేవలం కెమెరాలను సేకరించడమే ఒక పని అయితే వాటిని భద్రపరచడం మరో పెద్ద టాస్క్‌.. కెమెరాలను భద్రపరిచేందుకు తన ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం, ఆ గదిలో అలమరాలు ఏర్పాటు చేసి వాటి మధ్య కూర్చొని తానే సేకరించిన కెమెరాలను గర్వంగా చూసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తోందంటున్నాడు.

కెమెరాల కోసం పలు రాష్ట్రాలకు..

ప్రసాద్‌ కెమెరాలను సేకరించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాడు. దేశంలో కెమెరాల సేకరించే వారందరితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పాతతరం కెమెరాలను సేకరిస్తుంటాడు. హైదరాబాద్‌, గుజరాత్‌, ఆగ్రా, చైన్నె, ముంబైలోని పలువురు ఇదే హాబీతో ఉన్న వారితో పరిచయాలు ఉన్నాయి.

తన బాటలోనే పెద్ద కుమారుడు..

ప్రసాద్‌ తను నడిచిన మార్గంలోనే పెద్ద కుమారుడు మధు నడుస్తున్నాడు. ప్రస్తుతానికి ఫొటోగ్రఫీ రంగంలోనే ఉన్నా తండ్రికి సాయంగా ఉంటున్నాడు.

ఒక్క ఫొటో కోసం..

తన చిన్నతనంలో రీల్‌తో ఫొటో తీసిన తర్వాత ఆ ఫొటో డెవలప్‌మెంట్‌ చేసి, ప్రింట్‌ వేసేందుకు ఒక రోజు మొత్తం ఎదురు చూసేవాళ్లమని ప్రసాద్‌ తన అనుభవాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు కెమెరాల నుంచి సెల్‌ఫోన్‌, డ్రోన్‌, 360 డిగ్రీ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన పాతతరం కెమెరాల నాణ్యత, టెక్నాలజీ ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతున్నాయంటున్నారు. పాతతరం కెమెరాలను భవిష్యత్తు తరాలకు చూపించడమే తన అభిమతమని ప్రసాద్‌ పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement