లబ్బీపేట(విజయవాడతూర్పు): జూనియర్ వైద్యులు సమ్మె ప్రభావం ప్రభుత్వాస్పత్రిపై తీవ్రంగా చూపుతోంది. ఆపరేషన్‌లు, ఐపీ సంఖ్య బాగా తగ్గిపోయింది. కేవలం అత్యవసర వైద్యం అవసరమైన వారిని మాత్రమే అడ్మిషన్ చేస్తున్నారు. అలాంటి వారికే ఆపరేషన్‌లు చేస్తున్నారు. సర్జరీకి కొంతకాలం ఆగవచ్చు అనుకున్న వారిని మళ్లీ రమ్మని చెప్పి పంపిస్తున్నారు. అంతేకాదు క్యాజువాలిటీకి వచ్చిన రోగికి పరీక్షలు చేసి అడ్మిషన్ ఇవ్వడానికి రెండు, మూడు గంటల సమయం పడుతోంది. దీంతో ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకున్న రోగి బంధువులు వారిని మరో ఆస్పత్రికి తరలిస్తున్నారు.
భారీగా తగ్గిన సర్జరీలు..
విజయవాడ జీజీహెచ్‌లో అన్ని సర్జికల్ విభాగాల్లో కలిపి నిత్యం 70 నుంచి 80 వరకూ సర్జరీలు జరుగుతుంటాయి. జూడాల సమ్మె కారణంగా ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అందుకు మంగళవారం నిర్వహించిన సర్జరీలే నిదర్శనంగా చెప్పవచ్చు. మంగళవారం సుమారు 30 లోపు సర్జరీలు చేసినట్లు తెలిసింది. అంటే నిత్యం చేసే సర్జరీల్లో కనీసం 50 శాతం కూడా చేయని పరిస్థితి నెలకొంది. పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులు లేకపోవడంతో సర్జరీలకు రోగులకు పోస్ట్ చేయలేని దారుణ పరిస్థితి నెలకొంది. కేవలం సిజేరియన్‌లు, అత్యవసరమైన వారికి మాత్రమే సర్జరీలు చేస్తూ, మిగిలిన వాటిని వాయిదా వేస్తున్నారు. అదే విధంగా అడ్మిషన్స్ సైతం సగానికి పడిపోయాయి.
ఐఎంఏ మద్దతు..
జూడాల సమ్మెకు వైద్యుల సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబ్జి శ్యామ్‌కుమార్ కలిసి తన మద్దతు తెలియజేయగా, హెచ్‌ఆర్‌డీఏ(హెల్త్‌కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్) ప్రతినిధులు డాక్టర్ మహేష్ తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. బాలరాజు, సుబాష్‌చంద్రబోస్ మంగళవారం దీక్ష వద్దకు వెళ్లి, వారికి సంఘీభావం తెలిపారు.
రెండో రోజూ అత్యవసర సేవలు
బహిష్కరించిన జూడాలు
సగానికి పైగా తగ్గిన సర్జరీలు
అత్యవసర కేసులకే అడ్మిషన్
ఇస్తున్న వైనం
వైద్యం చేయకుండా ప్రభుత్వం చేతులు
కట్టేస్తోందంటూ వినూత్న రీతిలో నిరసన
జూడాలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రెండు చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన దీక్షలో కూర్చున్నారు. తమ సమస్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తాము అత్యవసర సేవలను బహిష్కరించినట్లు చెబుతున్నారు. రోగులు బాధపడుతుంటే చూస్తూ ఉండటం ఎంతో బాధాకరమంటున్నారు. వైద్యులుగా వారికి సహాయం చేయాలనే తపన ఉన్నప్పటికీ, తమ పరిస్థితులు మమ్మల్ని చేతులు కట్టుకుని నిలబడే స్థితికి తీసుకొచ్చాయన్నారు. రోగులను నిర్లక్ష్యం చేయడం తమ ఉద్దేశం కాదని, రోగుల బాధను చూస్తూ ఏమీ చేయలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలపై చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


