ప్రతిపాదనలకు బూజు | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలకు బూజు

Aug 4 2026 1:59 AM | Updated on Aug 4 2026 1:59 AM

ప్రతిపాదనలకు బూజు

మే 25న ఈదురు గాలులతో అకాల వర్షానికి మైలవరంలో భారీ నష్టం పెను గాలులకు ఏడు గ్రామాల్లో 521 ఇళ్లకు నష్టం, 29 ఇళ్లు నేలమట్టం పరిహారం ఇస్తామంటూ ఇచ్చిన హామీని పట్టించుకోని ప్రజాప్రతినిధి రెండు నెలలుగా ప్రభుత్వ సాయం కోసం బాధితుల ఎదురుచూపులు

పరిహారం ఊసెత్తడంలేదు

ఫొటోలో ఉన్న మిరియాల రమేష్‌, గీతాంజలి దంపతులు మూడేళ్ల క్రితం రూ.25 లక్షల రుణం తీసుకుని మైలవరంలో ఇస్తరాకుల కంపెనీ ప్రారంభించారు. మే 25వ తేదీన పెనుగాలులతో కూడిన భారీ వర్షానికి కంపెనీ షెడ్డు కూలి మెటీరియల్‌ పూర్తిగా ధ్వంసమైంది. పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి స్పందన కరువైంది. మరో రూ.10 లక్షలు అప్పు చేసి కంపెనీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. చేసిన అప్పులే భారమైతే మళ్లీ అప్పు చేయాల్సి వచ్చిందని, ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఈ దంపతులు వేడుకుంటున్నారు.
ఫొటోలకు ఫోజు..

జి.కొండూరు: అకాల వర్షం పేదల జీవితాలను కష్టాలపాలు చేసింది. మండు వేసవిలో పెను గాలు లతో విరుచుకుపడి 521 ఇళ్లను నేలకూల్చింది. మరుసటిరోజే ప్రజాప్రతినిధులు వచ్చారు. త్వరలో పరిహారం ఇస్తామని గొప్పలు చెప్పి ఫొటోలకు ఫోజులిచ్చారు. అధికారులు నష్టాలపై ప్రతిపాద నలు సిద్ధం చేశారు. రెండు నెలలు గడిచినా పరిహారం అందలేదు. హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధుల జాడలేదు. పట్టించుకున్న అధికారులూ లేరు.

పట్టించుకోని ప్రజాప్రతినిధి

మైలవరం మండలంలో మే 25న సాయంత్రం సమయంలో అరగంటపాటు పెనుగాలులతో కూడి భారీ వర్షం ఏడు గ్రామాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఆయా గ్రామాల్లో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. రేకుల ఇళ్లు, పూరిళ్లు, కోళ్ల ఫారాలు, పశువుల పాకలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. భారీ హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. మరుసటి రోజే నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆయా గ్రామాల్లో పర్యటించారు. బాధితులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటామంటూ గొప్పలు చెప్పారు. రెండు నెలలైనా పరిహారం మాట మరిచారు.

నష్టం ఇలా...

మే 25 న సాయంత్రం జరిగిన నష్టంపై అధికారులు అదే నెల 26, 27 తేదీల్లో అంచనాలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. అధికారుల అంచనా ప్రకారం మైలవరం గ్రామంలో 12 ఇళ్లు పూర్తిగా నేలమట్టమవగా మరో 46 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పొందుగలలో 87 ఇళ్లకు నష్టం వాటిల్లింది. 8 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా 75 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు కోళ్ల ఫారాలు, రెండు చర్చిలకు నష్టంవాటిల్లింది. చండ్రగూడెంలో 245 ఇళ్లకు నష్టం వాటిల్లింది. 232 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా ఐదు కోళ్ల ఫారాలు, ఒక చర్చి, పశువులు, మామిడికాయల పాకలు ఏడు ధ్వసమయ్యాయి. సబ్జపాడులో నాలుగు ఇళ్లు పూర్తిగా నేలమట్టమవగా 45 ఇళ్లు పాక్షికంగా దెబ్బతి న్నాయి. జంగాలపల్లిలో 59 ఇళ్లకు నష్టం వాటిల్లగా మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పుల్లూరులో ఒక ఇల్లు పూర్తిగా నేలమట్టమవగా 19 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెల్వడంలో ఒక ఇల్లు పూర్తిగా నేలమట్టమగా మరో రెండు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏడు గ్రామాల్లో 521 ఇళ్లకు నష్టం వాటిల్లింది. 29 ఇళ్లు పూర్తిగా నేలకూలగా 475 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏడు కోళ్ల ఫారాలు, మూడు చర్చిలు, ఏడు పశువులు, మామిడికాయల పాకలకు నష్టం వాటిల్లింది.

అకాల వర్షానికి నా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అధికారులు వచ్చి ఆధార్‌కార్డు, అకౌంట్‌ వివరాలు తీసుకున్నారు. రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ఎమ్మెల్యే వచ్చి ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందించలేదు. దయచేసి పరిహారం అందించి ఆదుకోవాలి.

– మత్తి భాస్కరరావు, బాధితుడు, జంగాలపల్లి గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement