ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.17 లక్షల విలు వైన లక్ష్మీకాసుల హారాన్ని కానుకగా సమర్పించారు. దొండేటి ఐశ్వర్యజ్యోతి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి 108 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కాసుల హారం అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దాతలకు వేద పండితుల ఆశీర్వచనం, ఆలయ డీఈఓ కిషోర్‌కుమార్, ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు అమ్మ చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): వ్యసనాల నిర్మూలనతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొ న్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశపు మందిరంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వ హించనున్న ‘10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహోద్యమం’ పోస్టర్‌ను జేసీ ఎం.నవీన్‌తో కలిసి కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మద్యం, పొగాకు, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఆరు నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి.నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ జి.శ్రీనివాసరావు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.


