ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మకు అశేష భక్తజనం, భక్త బృందాలు ఆషాఢ సారె సమర్పిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారికి భక్తులతో పాటు పలువురు ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు సారె సమర్పించారు. ఏపీసీపీడీసీఎల్ తరఫున సంస్థ సీఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, టి.వి.ఎస్.ఎన్.మూర్తి, వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ హనుమయ్య, ఈఈ ఏడుకొండలరావు, పలువురు అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్న అనంతరం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారె సమర్పించారు.
సారె సమర్పించిన 48 బృందాలు
ఆషాఢ మాసం 20వ రోజైన సోమవారం సుమారు 48 భక్త బృందాలు, 18,432 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. సారె సమ ర్పించిన భక్తులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. దుర్గగుడిలో శానిటేషన్ సిబ్బంది మంగళవారం అమ్మవారికి సారె సమర్పించనున్నారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణ నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తితో ఊరేగింపుగా బయలుదేరి, కనకదుర్గనగర్‌లో బలిపీఠం అమ్మవారిని దర్శించుకుని కొండపైకి చేరుకుని సారె సమర్పిస్తారు.


