అర్జీలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలి

Aug 4 2026 1:59 AM | Updated on Aug 4 2026 1:59 AM

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అందే అర్జీలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా పిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో 189 వినతులు నమోదయ్యాయి. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 78 అర్జీలు అందాయి. జిల్లాలో భూ వివాదాలు, సర్వే సమస్యలు, రెవెన్యూ అంశాలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నందున సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఆదేశించారు. పీజీ ఆర్‌ఎస్‌ పోర్టల్‌ను నిరంతరం పరిశీలిస్తూ పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను సక్రమంగా పరిష్కరించకపోవడం వల్ల ఒకే సమస్యపై పలుమార్లు అర్జీలు వస్తున్నాయని వివరించారు. నాణ్యమైన పరిష్కారాలపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. గత నవంబర్‌, డిసెంబర్‌ నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న భూ సర్వేలను వాతావరణం అనుకూలించిన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూమి సరిహద్దులు, రికార్డులు లేదా భూ హక్కులకు సంబంధించిన ప్రతి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని, సమస్య చిన్నదైనా అత్యున్నత ప్రాధాన్యతతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎరువుల దుకాణాలు, సహకార సంఘాలు ఉదయం ఆరు గంటలకే ప్రారంభం కావాలని పేర్కొన్నారు. డివిజనల్‌ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు ఎరువుల విక్రయాలను నిత్యం పర్యవేక్షిస్తూ అక్రమాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగుదారు హక్కు కార్డుల మంజూరులో ఎలాంటి ఆలస్యం ఉండదని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement