దుర్గమ్మ సన్నిధిలో మంత్రి వాసంశెట్టి | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో మంత్రి వాసంశెట్టి

Jul 12 2026 3:41 AM | Updated on Jul 12 2026 3:41 AM

దుర్గమ్మ సన్నిధిలో మంత్రి వాసంశెట్టి చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఐటీఐ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సుభాష్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లాబ్బాయ్‌) అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ చెప్పారు. గుంటుపల్లి రైజ్‌ కేంద్రంలో మిల్లెట్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ వర్క్‌షాప్‌ను కలెక్టర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీచుపదార్థం, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలు ఆరోగ్యకర జీవితానికి పునాదులు వేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులకు డిమాండ్‌ ఉందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలు ఇప్పటికే పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేశారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని కలెక్టర్‌ లక్ష్మీశ పిలుపునిచ్చారు. 80 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు 9నట్స్‌ సీఈవో వి.కీర్తన చిరుధాన్యాలతో తయారయ్యే ఆహార ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. డీఆర్‌డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నగరంలోని రమేష్‌ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. మొదటి అడ్మిషన్‌ను మెరిట్‌ నంబర్‌ 3 పొందిన ఎం.మణికంఠకు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో డీజిల్‌ మెకానిక్‌ విభాగంలో సీటు కేటాయిస్తూ అడ్మిషన్‌ లెటర్‌ను కౌన్సెలింగ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ ఎం.కనకారావు అందజేశారు. శనివారం మొత్తం 141 మంది విద్యార్థులకు వివిధ కళాశాలల్లో సీట్లు కేటాయించారు. కౌన్సెలింగ్‌ ఆది, సోమవారాలు కూడా కొనసాగుతుంది.

ఘనంగా ఏపీఎస్‌ఆర్టీసీ ఈయూ వజ్రోత్సవాలు

బస్టాండ్‌(విజయవాడ పశ్చిమ): ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 75వ ఆవిర్భావ వేడుకలు విజయవాడ జోన్‌ పరిధిలోని ఆటోనగర్‌, గవర్నర్‌పేట 1, 2 డిపోలలో శనివారం ఘనంగా నిర్వహించారు. జోనల్‌ కార్యదర్శి వైఎస్‌ రావు మాట్లాడుతూ 1952 నుంచి ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌ అలవెన్సుల సాధనలో, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంలో తమ యూనియన్‌ ఘనమైన పాత్ర పోషించిందని చెప్పారు. ఏపీఎస్‌ ఆర్టీసీని పరిరక్షించేందుకు తమ యూనియన్‌ కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు, డిపోల కార్యదర్శలు, జోనల్‌ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement