లోక్‌ అదాలత్‌తో శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌తో శాశ్వత పరిష్కారం

Jul 12 2026 3:41 AM | Updated on Jul 12 2026 3:41 AM

ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి

చిలకలపూడి(మచిలీపట్నం): వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవనం గడపాలంటే జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్‌లో శనివారం ఆయన జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆనందం ఎంతో ముఖ్యమని అదే ఆయుష్షును పెంచుతుందన్నారు. దీనికోసం వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. కోర్టుల చుట్టూ సంవత్సరాల పాటు తిరుగుతూ సమయం, నగదు వృథా చేసుకునే బదులు పరస్పర రాజీ ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటే ఇరుపక్షాలు సంతృప్తితో ప్రశాంతంగా జీవించగలరన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్‌.వరలక్ష్మి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.సునీత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజా వెంకటాద్రి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తుంగల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

1,15,261 కేసుల పరిష్కారం

లోక్‌అదాలత్‌లో 1,15,261 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 45 బెంచ్‌ల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వీటిలో 1,07,628 క్రిమినల్‌ కేసులు, 439 సివిల్‌ కేసులు, 692 చెక్‌బౌన్స్‌ కేసులు, 6356 ప్రీలిటిగేషన్‌ కేసులు పరిష్కరించామన్నారు. 146 మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లకు రూ. 9.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించేందుకు అంగీకరించాయన్నారు. మచిలీపట్నం కోర్టులో 9182 కేసులు, విజయవాడలో 33,971, గుడివాడలో 15,237, నందిగామలో 11,430, నూజివీడులో 11,669, మైలవరం 1830, జగ్గయ్యపేట 4735, బంటుమిల్లిలో 2238, కై కలూరులో 1053, తిరువూరులో 5313, గన్నవరం 9821, అవనిగడ్డలో 3160, మొవ్వ 2284, ఉయ్యూరు 3338 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement