చిల్లకల్లులో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు రూ. 7.67 లక్షల అపరాధ రుసుం
చిల్లకల్లు(జగ్గయ్యపేట): విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయకుమారి హెచ్చరించారు. చిల్లకల్లు సెక్షన్ పరిధిలోని 20 గ్రామాల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అనంతరం పాలశీతలీకరణ కేంద్ర భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెక్షన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో 41 బృందాలుగా ఏర్పడి 2,522 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేశామన్నారు. వీటిలో 359 సర్వీసులు అదనపు విద్యుత్ వాడుతున్నట్లు గుర్తించి వారికి రూ. 7.67 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ డీఈ రవిచంద్ర, విజిలెన్స్ డీఈలు శ్రీనివాసరావు, శివకుమార్, గురుకిషోర్, సుధాకర్, ఏఈ రమేష్‌బాబు, అకౌంట్స్ అదికారి రవికుమార్, డివిజన్‌లోని సిబ్బంది పాల్గొన్నారు.


