ఆమోదం తెలిపినా అడ్డగింత
చిలకలపూడి(మచిలీపట్నం): మండలాల్లో ప్రజాప్రతినిధులైన తమపై వివక్ష చూపుతున్నారని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంపీడీవోలు అధికార పార్టీల నాయకుల చెప్పు చేతల్లో ఉండే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా ఉండి కూడా మండలాల్లో జరుగుతున్న పనులపై తమకు సమాచారం ఇవ్వటం లేదని సభ్యులు ఆరోపించారు. జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం గురువారం మధ్యాహ్నం జెడ్పీ సమావేశపు హాలులో చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా 2025–26, 2026–27 బడ్జెట్ అంచనాలను ఆమోదించారు. అనంతరం ఈ సమావేశంలో పలు సమస్యలను సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి పనులను మంజూరు చేసినా ఆ పనులు జరగకుండా ఎంపీడీవోలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
● రూ. 5 లక్షల్లోపు పనులు కూడా చేయనివ్వకుండా తాత్సారం చేస్తున్నారని పామర్రు ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్, అవనిగడ్డ ఎంపీపీ తుంగల ప్రభావతి సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చైర్‌పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ త్వరలో ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతామన్నారు.
● కృత్తివెన్ను మండలంలో రొయ్యల చెరువులకు ప్రతిరోజు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి సభ దృష్టికి తీసుకువచ్చారు.
● గూడూరు మండలం తుమ్మలపాలెం గ్రామానికి తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు నుంచి గత 15 రోజులుగా తాగునీరు సరఫరా కావటం లేదని ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గూడూరు జెడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్‌బాబు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
● మండవల్లి మండలంలో జల్‌జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయిని ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు ఇంత వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండవల్లి ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
బడ్జెట్ అంచనాలు ఆమోదం..
జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరం సవరణ బడ్జెట్, 2026–27 బడ్జెట్ అంచనాలను ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. జిల్లా పరిషత్‌కు సంబంధించి 2026–27 సంవత్సరానికి ప్రారంభ నిల్వగా రూ.120,34,41,614 ఉండగా, రానున్న సంవత్సరంలో జిల్లా పరిషత్‌కు రూ.2,140,12,78,469 ఆదాయం అంచనాగా చూపించారు. దీనిలో రూ.2,123,99,95,149 ఖర్చుగా అంచనాలను రూపొందించారు. రూ.136,47,25,114 ముగింపు నిల్వగా అంచనాలను రూపొందించారు. నూజివీడు సబ్‌కలెక్టర్ బి. వినూత్న, జెడ్పీ సీఈవో కె కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్, బందరు ఇన్‌చార్జ్ ఆర్డీవో పోతురాజు, వైస్‌చైర్మన్ గరికిపాటి శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎంపీడీవోలపై
సభ్యుల ఆగ్రహం


