25న పవర్ లిఫ్టింగ్ సెలక్షన్స్
తిరువూరు: రాజమండ్రిలో జరగనున్న రాష్ట్రస్థాయి క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎన్టీఆర్ జిల్లా జట్టు ఎంపిక ఈ నెల 25న జరుగుతుందని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.విశ్వేశ్వరరావు, వి.మల్లేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలు ఫిబ్రవరిలో జరుగుతాయని పేర్కొన్నారు. తిరువూరులోని ఫిట్ జోన్ ఆవరణలో జరిగే ఎంపికలకు 25వ తేదీ ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్సు ప్రతులతో రావాలని సూచించారు.
బాడీ బిల్డింగ్ క్రీడాకారుల ఎంపిక
పెనమలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ క్రీడాకారుల ఎంపిక ఈ నెల 25వ తేదీ జరుగుతుందని బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు గురువారం కానూరులో వివరాలు తెలుపుతూ ఈ వచ్చే నెల 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో 16వ జూనియర్స్ బాడీ బిల్డింగ్ పోటీలు పురుషులకు, మహిళలకు, దివ్యాంగులు, ఫిజిక్ స్పోర్ట్స్, మాస్టర్స్‌లకు ఉంటాయన్నారు. మార్చి 28, 29 తేదీల్లో 17వ సీనియర్స్ పురుషులు, మహిళలకు జాతీయ పోటీలు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరుగుతాయన్నారు. వీటిలో పాల్గొనేవారికి ఈ నెల 25న కానూరు అశోక్ జిమ్‌లో ఉదయం 7 గంటలకు క్రీడాకారుల ఎంపిక ఉంటుందన్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డుతో రావాలన్నారు. వివరాలకు అల్లారిరెడ్డి 86867 71358 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
ఐస్ స్కేటింగ్‌లో రజతం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన లడఖ్‌లో ఈ నెల 20న జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్–2026లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీ రాజ్ సీనియర్ గరల్స్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. జెస్సీరాజ్ విజయవాడలోని ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థిని. ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అమితాబ్ శర్మ, సెక్రటరీ జగరాజ్ సింగ్ సహానీ, ఫిగర్ స్కేటింగ్ హెడ్ నటాలి, ఏపీ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సెక్రటరీ ఖాజా, కోచ్ అబ్దుల్ హఫీజ్ వెండి పతకాన్ని సాధించిన జెస్సీరాజ్‌ను అభినందించారు.
నేడు ‘చర్లపల్లి–తిరువనంతపురం’ అమృత్ భారత్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల డిమాండ్ మేరకు భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన చర్లపల్లి–తిరువనంతపురం నార్త్ మధ్య అమృత్ భారత్ రెగ్యులర్ సర్వీస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. తిరువనంతపురం నార్త్–చర్లపల్లి రైలు 06308 నంబర్‌తో ప్రారంభోత్సవ సర్వీస్‌గా శుక్రవారం ప్రారంభమయ్యే ఈ రైలు.. అనంతరం కొనసాగింపుగా ఈ నెల 27 నుంచి 17041/17042 నంబర్లతో రెగ్యులర్‌గా నడవనున్నాయి. వీటి బుకింగ్స్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభంకానున్నట్లు అధికారులు ప్రకటించారు.
27వ తేదీ నుంచి..
చర్లపల్లి–తిరువనంతపురం నార్త్ (17041) ఈ నెల 27 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17024) ఈ నెల 28 నుంచి ప్రతి బుధవారం తిరువనంతపురం నార్త్‌లో బయలుదేరి, గురువారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, కాట్‌పాడి, జోలర్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పుర్, కోయంబత్తుర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం, కొట్టాయం, చంగనస్సేరి, తిరువెళ్ల, చెంగనూరు, మావేలికర, కాయంకుళం, కొల్లం, వార్కాల స్టేషన్లలో ఆగుతుంది.
రెండో రోజు జేఈఈ మెయిన్స్ ప్రశాంతం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మొయిన్స్ పరీక్ష రెండో రోజు గురువారం సైతం ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పరీక్ష జరిగింది. సుమారు ఐదు కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పరీక్షను నిర్వహించారు. ఉదయం షిప్ట్‌కు సంబంధించి ఐదు కేంద్రాల్లో 2704 మంది విద్యార్థులను కేటాయించగా 2672 మంది హాజరయ్యారు. 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి జరిగిన రెండో షిప్ట్‌లో 2707 మంది విద్యార్థులను కేటాయించగా, 2681 మంది హాజరయ్యారు. 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగాయి. వీటిని సమన్వయకర్త జి.బర్నబాస్ పర్యవేక్షించారు.


