రాష్ట్ర క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
ఎంపీ కేశినేని శివనాథ్ పాలిటెక్నిక్ కళాశాలల రీజనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సాహకాలను అందిస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చెప్పారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల రీజనల్ స్పోర్ట్స్ మీట్ సోమవారం ప్రారంభమైంది. వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, త్రిపుల్ జంప్, షార్ట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలెన్‌త్రో అంశాల్లో పోటీలు జరిగాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అతిథులుగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి, బెలూన్లు, పావురాలను ఎగుర వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ నగరంలో జరిగిన 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన టి.సూర్య చరిష్మ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి నగరానికి పేరు తేవడమే కాకుండా ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జీవీ రామచంద్రరావు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు..
రాష్ట్ర క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు


