కృష్ణా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గ్రీన్ క్లైమెట్ ఫండ్ వినియోగించుకుని మత్స్యసంపదను పెంపొందించే దిశగా ప్రత్యేక దృష్టిసారించి మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో గ్రీన్ క్లైమెట్ ఫండ్ వినియోగంపై సంబంధిత అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నిధులతో పీతలు, సముద్రనాచు, అలంకార చేపల పెంపకం యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్ ఉందని, అధిక ఆదాయం పొందే విధంగా మత్స్యకారులకు అవగాహన కల్పించాలన్నారు.
పీతల పెంపకంపై దృష్టి..
జిల్లాలో 27 పీతల పెంపకం యూనిట్లు ప్రారంభించాల్సి ఉంది. ఒక్కొక్క యూనిట్‌కు రూ. 19,400 అవుతుందని, 64 మంది లబ్ధిదారులను గుర్తించామని కలెక్టర్ చెప్పారు. పీతల పిల్లల కోసం ఆర్‌జీసీఐకు ఇండెంట్ పెట్టాలన్నారు. రానున్న ఫిబ్రవరి రెండో వారంలో యూనిట్లు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కేటాయించిన రూ. 9 లక్షలకు సంబంధించి వినియోగ ధ్రువీకరణ పత్రం సిద్ధం చేసి పంపాలన్నారు. జిల్లాలో 25 సముద్రనాచు పెంపకం యూనిట్ల కోసం 80మంది సిద్ధంగా ఉన్నారని ఒక్కొక్క యూనిట్ విలువ రూ. 11,660 అని వీటికి జనవరి మొదటి వారంలో చెల్లింపులు చేయాలన్నారు. అలంకార చేపల యూనిట్ విలువ రూ. 45,948 కాగా 10 మంది కృత్తివెన్ను మండలంలో లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. జనవరి మొదటి వారంలో యూనిట్లు మొదలయ్యేలా చొరవ చూపాలన్నారు. వచ్చే సంవత్సరం మరో 500 పీతల పిల్లల పెంపకం యూనిట్లు నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 4వ తేదీన మత్స్యకారులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, మత్స్యశాఖ జేడీ ఎ. నాగరాజు, డీఎఫ్‌వో సునీత, గ్రీన్ క్లైమెట్ ఫండ్ ప్రాజెక్టు మేనేజర్ ఉష, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.


