బాల్య వివాహాల నివారణపై అవగాహన
గూడూరు:బాల్య వివాహాల నివారణకు అందరూ కృషి చేయాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ యు.ఉషశ్రీ అన్నారు. బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ముక్కొల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ పెళ్లి ఈడు రాకుండా వివాహం చేసుకుంటే శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పెళ్లి ఈడు వచ్చే వరకు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను రూపుమాపటానికి బాలబాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.శారద, జి.హేమలత, అరుణాదేవి, ఎంఎస్‌కే రీనా బేగం, ఏఎన్‌ఎం కాగిత కోమలి, భవాని, ఉదయలక్ష్మి, అర్చన, వరలక్ష్మి, పి.భాగ్య పాల్గొన్నారు.


