జాబ్ క్యాలెండర్ ఎక్కడ బాబూ?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం విజయవాడ లెనిన్ సెంటర్‌లో యువతీ యువకులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, లోకేశ్ ఎన్నికలకు ముందు ఏటా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీల నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే జనవరి 30వ తేదీన చలో సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’ అని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్, ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, నాయకులు లంకా గోవిందరాజులు, సాయికుమార్, మాధవి, యువతీ యువకులు పాల్గొన్నారు.


