దుర్గగుడికి కొనసాగుతున్న రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు శుక్రవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టగా, రూ. 100, రూ. 300 టికెట్ క్యూలైన్‌లో గంట సమయం, రూ. 500 వీఐపీ టికెట్ క్యూలైన్‌లో రెండు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఘాట్‌రోడ్డులో ఓంటర్నింగ్ వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో 60 వేల పైబడి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
టికెట్ల విక్రయాలపై గందరగోళం
రద్దీ సమయాల్లో టికెట్ల విక్రయాలపై గందరగోళం నెలకుంటుంది. శుక్రవారం ఉదయం నుంచి రద్దీ ప్రారంభం కావడంతో టికెట్ల విక్రయాలను ఉదయం 11 గంటల కల్లా నిలిపివేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారం కౌంటర్లలోని సిబ్బందికి తెలియకపోవడంతో వారు యథావిధిగా టికెట్లను విక్రయించారు. మధ్యాహ్నం మహా నివేదన తర్వాత అంతరాలయ దర్శనం నిలిపివేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అప్పటికే రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అంతరాలయ దర్శనం కొనసాగించారు.
మొరాయించిన సర్వర్..
దేవస్థానంలో అన్ని సేవలు ఆన్‌లైన్ ద్వారానే అందిస్తుండగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు సర్వస్ మోరాయించింది. మహా మండపం దిగువన రూ.100, రూ.300 టికెట్ల కౌంటర్లతో పాటు రూ. 500 టికెట్ కౌంటర్‌లో టికెట్ల విక్రయాలు నిలిచిపోయాయి. ఆయా కౌంటర్లలో సిబ్బంది టికెట్లను స్కానింగ్ పాయింట్‌లో కొనుగోలు చేయాలని చెబుతుండటంతో భక్తులందరూ గాలిగోపురం దిగువన ఉన్న స్కానింగ్ పాయింట్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా కంప్యూటర్ పని చేయకపోవడంతో గందరగోళ పరిస్ధితులు నెలకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు లడ్డూలు ఇవ్వడం లేదని, వాటిని ప్రసాదాల విక్రయ కౌంటర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని కొద్ది రోజులుగా దేవస్థానంలో ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఇదే అంశంపై పలువురు భక్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు.


