రంగా హత్య కేసులో టీడీపీనే తొలి ముద్దాయి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగాది ముమ్మాటికీ సర్కారీ హత్యేనని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రంగా హత్య కేసులో ఆనాటి టీడీపీ ప్రభుత్వం, ప్రభుత్వంలోని పోలీసులు, నాయకులు అందరూ కలిసి ఆయన్ను హత్య చేశారన్నారు. అప్పటికీ, ఇప్పటీకీ రంగా హత్య కేసులో తొలి ముద్దాయి టీడీపీయేనన్నారు. శుక్రవారం దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 37వ వర్థంతి కార్యక్రమం విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీసెంట్ రోడ్డులో, సీతన్నపేట గేటు వద్ద రంగా విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అనాటి టీడీపీ అప్రజ్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలు, దాష్టీకాలను రంగా ధైర్యంగా ఎదుర్కొని పోరాడారన్నారు. సమస్యలపై ప్రజా పోరాటాలు చేశారన్నారు. శిరోముండనం కేసులో అరెస్ట్‌లు చేసే వరకు, క్రీస్తు రాజుపురంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని రోడ్డుపై నిరాహార దీక్షలో కూర్చున్నారని గుర్తు చేశారు. ఆ దీక్షలోనే ఆయన్ను దారుణంగా హత్య చేయించారన్నారు. ఆయన హత్యకు ఏపార్టీ కారణమో అదే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగా విగ్రహాలకు డండలు వేస్తుంటే ఆశ్చర్యంగాను, వింతగాను ఉందన్నారు. ఇలా చేస్తే రంగా ఆత్మ క్షోభించకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. వంగవీటి మోహన్‌రంగా మరణించే వరకు టీడీపీకీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేశారన్నారు. టీడీపీ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయాలు చేస్తోందన్నారు. దివంగత నేత వైఎస్సార్ అనుక్షణం రంగాను కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. రంగా ఆశయాలు, సిద్దాంతాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయన్నారు. వంగవీటి రంగానే తమకు ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలే పుల్లారావు, ఒగ్గు విక్కీ, సుధాకర్, శ్రీరాములు, ఇసరపు రాజా, ఉద్దంటి సురేష్, మాంతి రమణరావు తాడి శివ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు


