వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
తిరువూరు/బంటుమిల్లి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వీరిలో ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వారు మరొకరిది కృష్ణాజిల్లా. కాగా చనిపోయిన ఇద్దరు యువకుల పేర్లు కార్తీక్ కావడం గమనార్హం. విజయవాడ–జగదల్‌పూర్ జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన జల్ది కార్తీక్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పశువుల సంత సమీపంలో వేగంగా వెళుతున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. కార్తీక్ బైక్‌పై ఉన్న మరో యువకుడు దేవరపల్లి సాయికిరణ్ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అవివాహితుడైన కార్తీక్ తిరువూరులోని సెల్ పాయింట్‌లో పని చేస్తున్నాడు. అతడి మృతికి సంతాప సూచకంగా శుక్రవారం సెల్ ఫోన్ దుకాణాలు మూసి వేశారు.
వాహనం అదుపు తప్పి మరో యువకుడు..
బంటుమిల్లి మండల పరిధిలోని ఆముదాల పల్లి పంచాయతీ శివారు జయపురం గ్రామం వద్ద బంటుమిల్లి గుడివాడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మరో యువకుడు మృతి చెందాడు. మల్లేశ్వరం గ్రామానికి చెందిన వీరమల్లు రజినికుమార్ పెద్ద కుమారుడు వీరమల్లు కార్తీక్ (22) ఈ నెల 25వ తేదీన బంటుమిల్లి వైపు వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ను బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.
నలుగురు అరెస్టు, 10 బైక్‌లు స్వాధీనం
పామర్రు: మండల పరిధిలోని పెరిశేపల్లి శివారు కాలువ గట్లపై పేకాట ఆడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పామర్రు ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తమకు అందిన విశ్వసనీయంగా సమాచారం మేరకు సీఐ వి.సుభాకర్, ట్రైనీ మహిళా ఎస్‌ఐ సత్యకళ సిబ్బందితో కలిసి సాయంత్రం 5 గంటల సమయంలో పరిశేపల్లి శివారు కాలువ గట్టు వద్ద పేకాట ఆడుతున్న వారిని గుర్తించామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.9,600 నగదు, 10 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం


