జనవరి 12న ఎన్జీవోస్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఎన్నికలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కె.జగదీశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఈనెల 29న ఎన్జీవో హోమ్‌లో పబ్లిష్ చేస్తామన్నారు. జిల్లా శాఖకు ఒక అధ్యక్షుడు, ఒక సహాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, కార్యనిర్వాహక కార్యదర్శితోపాటు ఐదుగురు ఉపాధ్యక్షులు ఒక మహిళా ఉపాధ్యక్షురాలు – ఐదు సంయుక్త కార్యదర్శులు, ఒక మహిళ సంయుక్త కార్యదర్శి కలిపి మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జనవరి 3న నామినేషన్లు స్వీకరణ, అదేరోజు పరిశీలన, అర్హుల జాబితా ప్రచురణ, నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రచురణ నిర్వహిస్తామన్నారు. సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట సంఘ ప్రచార కార్యదర్శి బి.జానకి, పర్యవేక్షకుడిగా రాష్ట్ర కార్యదర్శి వి.సుబ్బారెడ్డి వ్యవహరిస్తారని ఎన్నికల అధికారి జగదీశ్వరరావు తెలిపారు.
పని దొరకడం లేదని..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పట్టపగలు ఓ వ్యక్తి కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన నెల్లూరులోని కనకమహాల్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన 41 సంవత్సరాల వయసున్న అమీర్‌వలీ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో పనుల కోసం కొద్దిరోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరక్కపోవడంతో మానసికంగా ఆందోళనకు గురై గురువారం ఉదయం కనకమహాల్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డుపై చిన్న కత్తితో తన మెడ, పొట్ట భాగాల్లో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అమీర్‌వలీని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు.
వాహనం ఢీకొని
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన హైవేపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం పదహారవ నంబరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారు 30– 35 మధ్య ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు 86888 31386, 91548 76312 నంబర్లకు సమాచారం అందించాలని ప్రత్తిపాడు ఎస్‌ఐ కె.నరహరి తెలిపారు.
జనవరి 12న ఎన్జీవోస్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఎన్నికలు


