మాజీ మంత్రి కాకాని కృషి చిరస్మరణీయం
హనుమాన్‌జంక్షన్‌రూరల్: సహకార రంగంలో పాడి పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో క్షీర విప్లవానికి నాంది పలికిన కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. మాజీ మంత్రి, జైఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమాలు హనుమాన్‌జంక్షన్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక విజయవాడరోడ్డులోని పాలశీతల కేంద్రం ప్రాంగణంలో కాకాని వెంకటరత్నం విగ్రహానికి చలసాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తరుణంలో కాకాని వెంకటరత్నం చొరవతోనే రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు గ్రామగ్రామాన ఏర్పడ్డాయని చలసాని వివరించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గానూ పాడి పరిశ్రమ అభివృద్ధికి, కృష్ణా మిల్క్ యూనియన్ బలోపేతానికి కాకాని విశేష కృషి చేశారని కొనియాడారు. పలువురు పాల సహకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు.


