అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
జగ్గయ్యపేట అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో బుధవారం పర్యటించిన మంత్రి రవీంద్ర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పటికే రూ.50 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోందని, అందులో భాగంగానే గూగుల్ ఏఐ సెంటర్ విశాఖకు రప్పించిందన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి సంవత్సర కాలం పట్టిందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కల్తీ మద్యం నుంచి విముక్తి లభించిందన్నారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పోలంపల్లి మునేరు ఆనకట్టకు మరమ్మతులు చేయాలని, గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ మల్లెల సీతమ్మ గ్రామీణ రోడ్లకు మార్కెటింగ్ శాఖ నిధులు వాడుకునేలా చూడాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని మంత్రికి విన్నవించారు. శాంతినగర్, విష్ణుప్రియనగర్ వాసులు కాలుష్య సమస్యపై మంత్రికి విన్నవించారు. ఈనాం భూముల సమస్య పరిష్కరించాలని బాధితులు మంత్రిని కోరారు. అనంతరం నూతనంగా ఏఎంసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లెల సీతమ్మను మంత్రి సత్కరించారు.
మంత్రి కొల్లు రవీంద్ర


