రోడ్డు ప్రమాద బాధితులకు ఊరట
238 కేసుల్లో 247 మందికి రూ.2 కోట్ల మేరకు పరిహారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు వెల్లడి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హిట్ అండ్ రన్(గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన) 238 ఘటనల్లో 247 మంది బాధితులకు రూ.2 కోట్ల మేర పరిహారం అందించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. వారిలో 51 మంది మృతి చెందగా ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు, తీవ్ర గాయాలైన 196 మందికి ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున పరిహారం అందించినట్లు వివరించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా కృషి చేసిన పోలీసు అధికారులను బుధవారం సీపీ రాజశేఖరబాబు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫారూక్ తాడేపల్లిలో నూడిల్స్ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండేవాడని, సరుకుల కోసం విజయవాడ భార్యతో కలిసి రాగా, గత ఏడాది జూన్ 9న జరిగిన ప్రమాదంలో భార్య మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం నెల్లూరు వెళ్లిపోయిన ఫారూక్ వివరాలు తెలుసుకుని, అతనికి రూ.2 లక్షల పరిహారం అందేలా రెవెన్యూ అధికారులతో కలిసి కృషి చేసినట్లు తెలిపారు. ఇలా 51 మందికి రూ.2 లక్షల చొప్పన అందించామన్నారు. ఇలాంటి హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం అందేలా చేయడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని గుర్తించలేని ఘటనల్లో సరైన పత్రాలు సేకరించి బాధితులకు పరిహారం అందేలా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం, ఏసీపీ పి.రామచంద్రరావు, హెడ్ కానిస్టేబుల్ ఎన్‌వీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ వి.లీలా సాయికిరణ్‌లను ప్రశంసాపత్రాలతో సీపీ రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు.


