పల్స్ పోలియోపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): డిసెంబరు 21వ తేదీన నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంపై గురువారం ఎన్టీఆర్ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీఐఓ డాక్టర్ శరత్, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణపై డీఎంహెచ్‌ఓ దిశా నిర్దేశం చేశారు. ఒకే విధమైన, సకాలంలో పల్స్‌పోలియో యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు అవసరమైన చర్యలను వివరించారు. హైరిస్క్ ఏరియాల గుర్తింపు, స్లమ్ ఏరియాలో ఉన్న జనాభాలోని పిల్లల కోసం మైక్రో ప్లాన్‌లు, కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలను వివరించారు. వందశాతం పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా క్షేత్రస్థాయి సమన్వయం, సత్వరం స్పందించడం, పర్యవేక్షణను బలోపేతం చేయడం వంటి అంశాలపై డాక్టర్ సుహాసిని చర్చించారు. సరైన బూత్ నిర్వహణ, పోలియో చుక్కలు వేయించుకోని వారిని గుర్తింపు వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలు ప్రాంతాల సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.


