భక్తిశ్రద్ధలతో కోటి దీపోత్సవం
ఇబ్రహీంపట్నం: కార్తికమాసం చివరిరోజు పురస్కరించుకుని పవిత్ర సంగమం వద్ద కోటి దీపోత్సవం కొండపల్లి మునిసిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి వైభవంగా జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జ్యోతిని వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అర్చకుల వేదమంత్రోచ్చరణలతో స్థానిక ప్రజాప్రతినిధులు, మునిసిపాలిటీ అధికారులు వైభవంగా జరిపించారు. భక్తుల శివనామస్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. శివపార్వతుల కల్యాణం అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో పలువురు భక్తులు కోటి దీపాలు వెలిగించారు. దీపాల వెలుగుల్లో పవిత్ర సంగమం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఎంపీ చిన్ని, కలెక్టర్ లక్ష్మీశను మునిసిపల్ పాలకవర్గం సత్కరించి జ్ఞాపికలు అందజేసింది. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కమిషనర్ రమ్యకీర్తన, పలువురు కౌన్సిలర్‌లు, భక్తులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో కోటి దీపోత్సవం


