దేవుని సొమ్ముకు భద్రత కరువు
ఆలయాలే లక్ష్యంగా చోరీలకు తెగబడుతున్న దొంగలు సీసీ కెమెరాలకు చిక్కకుండా ముసుగు ధరించి చోరీలు నగదు, వెండి, బంగారు నగలను స్వాహా చేస్తున్న వైనం
జి.కొండూరు: దొంగలు ఆలయాలల్లో వరస చోరీ లకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ముసుగు ధరించి, సీసీ కెమెరాలకు చిక్కకుండా దొంగలు తీసుకుంటున్న జాగ్రత్తలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. భద్రత, నేరాల అదుపు, కేసుల సత్వర పరిష్కారం కోసం సురక్ష–360 పేరుతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా జరుగుతున్న వరస చోరీలు ఆందోళన కలిగిస్తు న్నాయి. ముఖ్యంగా ఆలయాల్లో చోరీలు జరగడం చూసి దేవుడి సొమ్ముకే భద్రత లేకపోతే ఇక తమ పరిస్థితి ఎంత అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పర్యవేక్షణ లేకనే..
సాధారణంగా ఇళ్లలో చోరీ చేయాలంటే అంత సులువు కాదు. గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాల వద్ద రాత్రి సమయంలో ఎవరూ ఉండరు. ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ సరిగా లేకపోయినా, దేవాలయాల కమిటీల పర్యవేక్షణ లోపం దొంగలకు అవకాశంగా మారు తుంది. హుండీలు, దేవుడికి అలంకరించే వెండి, బంగారు ఆభరణాలను కచ్చితంగా ఆలయంలో ఏక్కడో ఒక చోట దాచి ఉంచుతారనే అంచనాతో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. దేవాలయ కమిటీలు సమన్వయంతో వ్యవహరించి సీసీ కెమెరాలు సరిగా పనిచేసేలా చూడటంతోపాటు, విలువైన ఆభరణాలను బ్యాంకు లాకర్లలో ఉంచి అవసరమైనప్పుడు స్వామి వార్లకు అలంకరించేలా జాగ్రత్తలు తీసు కుంటే చోరీలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
సవాలుగా మారిన చోరీలు
ఆలయాల్లో వరసగా జరుగుతున్న చోరీలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకొకచోట చోరీ జరుగుతుండటంతో స్థానికు లతో కలిసి దొంగల ముఠా ఈ చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతోంది. చోరీలకు పాల్పడేది ఒకటే దొంగల ముఠానా లేక వేరు వేరు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నారా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. విజయవాడ సీపీ ఆధ్వర్యంలో సురక్ష – 360 కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 10,500 కెమెరాలను ప్రముఖ ప్రదేశాలు, ఆలయాలు, చర్చిలు, మసీ దుల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులు, ముఖ్య కూడళ్లలో ప్రభుత్వానికి సంబంధించిన 1,907 సీసీ కెమెరాలు ఇప్పటికే ఉన్నాయి. అయినా చోరీలు జరగడం, దొంగలను గుర్తించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.


