
రూ.లక్షలు గుంజి బిడ్డల శవాలు అప్పగించారు
●నోరీ ఆస్పత్రి వద్ద మృతుల బంధువుల ఆందోళన
●చికిత్స పొందుతూ ఆస్పత్రిలోఒకేరోజు ఇద్దరు చిన్నారులు మృతి
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): విజయవాడ సత్యనారాయణపురంలోని నోరీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒకే రోజు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తమ వద్ద రూ.లక్షలు వసూలు చేసి చివరికి బిడ్డల మృతదేహా లను అప్పగించారంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 29 రోజుల శిశువు, 18 నెలల చిన్నారి వైద్యం వికటించి మంగళవారం మృతి చెందారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబాల సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు.
జలుబుతో ఆస్పత్రిలో చేర్పిస్తే..
నగరంలోని కేఎల్ రావునగర్‌కు చెందిన కట్టా శ్రీను, ప్రసన్న దంపతుల పెద్ద కుమార్తె 18 నెలల శాన్వితదేవికి జలుబు చేయడంతో ఈ నెల 19న నోరీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారికి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉందని, వైద్యానికి రోజుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు. శ్రీను, ప్రసన్న దంపుతులు భయపడి శాన్వితదేవిని ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు సోమవారం శ్రీను, ప్రసన్నను పిలిపించి చిన్నారి పరిస్థితి విషమిస్తోందని, చైన్నెలో స్పెషలిస్ట్ డాక్టర్లు, అత్యాధు నిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వారు రావాలంటే రూ.5 లక్షల ఖర్చవుతుందని, సిబ్బందికి స్టార్ హోట్‌ళ్లలో విడిది ఖర్చులు భరించాల్సి ఉంటుందని చెప్పారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడితే చాలని తల్లిదండ్రులు ఒప్పకొని వారు అడిగిన మొత్తం చెల్లించారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు చికిత్స ప్రారంభించామని చెప్పిన వైద్యులు, మంగళవారం తెల్లవారుజాము 5.30 గంటల సమయంలో చికిత్స చేస్తుండగా చిన్నారికి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందిందని, బేడ్ షీట్‌లో చుట్టుకుని మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో శాన్వితదేవి తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చికిత్స పేరుతో తమ వద్ద రూ.12 లక్షలు వసూలు చేసి చివరికి బిడ్డ మృతదేహాన్ని అప్పగించడంపై ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ నోరీ సూర్యనారాయణ, డాక్టర్ శ్రీధర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
29 రోజుల శిశువు మృతి
భవానీపురానికి చెందిన భార్గవి నోరీ ఆస్పత్రిలో 29 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉన్నాడని, ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించాలని అందుకు రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో తాము అంత భరించలేమని, ప్రభుత్వా ఆస్పత్రికి తీసుకెళ్తామని భార్గవి కుటుంబ సభ్యులు చెప్పారు. శిశువును కదిపితే మరింత ఇబ్బందులు తలెత్తుతాయని, డబ్బులు ఎంత ఉంటే అంత చెల్లించి, ఎమ్మెల్యే నుంచి ఎల్‌ఓసీ సిఫార్సు లెటర్ తెచ్చుకుంటే చికిత్స చేస్తామని ఆస్పత్రి నిర్వాహకులు సూచించారు. దీంతో చిన్నారి తండ్రి ఇన్సూరెన్స్ డబ్బులు రూ.2 లక్షలు చెల్లించి తమకు తెలిసిన టీడీపీ నాయకుడి సహకారంతో ఎమ్మెల్యే ద్వారా రూ.9.20 లక్షలకు ఎల్‌ఓసీ లెటర్‌ను అందజేశాడు. అనంతరం తమ బిడ్డను చూపించాలని అడిగితే, చికిత్స జరుగుతోందని ఇప్పుడు కుదర దని సిబ్బంది స్పష్టంచేశారు. దీంతో భార్గవి బంధువులు బలవంతంగా తలుపులు నెట్టుకుని లోపలికి వెళ్లగా అప్పుడే శిశువు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో వారు ఆందోళన చేశారు.
బాధితులతో రాజీ యత్నాలు
ఒకే రోజు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి యాజమాన్యం రాజీ ప్రయత్నాలు చేపట్టింది. ముందుగా శిశువు బంధువులకు రూ.5 లక్షలు చెల్లించి, ఎవరి కంటా పడకుండా పక్క ద్వారం నుంచి పంపించేసింది. అనంతరం చిన్నారి శాన్వితదేవి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారు చెల్లించిన డబ్బులకు అదనంగా ఇచ్చి రాజీ చేసుకున్నారని సమాచారం.
ఫిర్యాదులు అందలేదు
నోరీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకు న్నామని ఎస్‌ఎన్‌పురం ఇన్‌స్పెక్టర్ ఎస్.వి.వి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనల్లో బాధితుల నుంచి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు.

రూ.లక్షలు గుంజి బిడ్డల శవాలు అప్పగించారు