
కలకలంరేపిన యూరియా నిల్వలు
●ఆత్కూరులో ఓ షెడ్డులో నిల్వ ఉంచిన యూరియా కట్టలు
●చెవుటూరు పీఏసీఎస్ నుంచి టీడీపీ నాయకుడు తరలించినట్లు ఆరోపణలు
●ఇటీవల పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సదరు టీడీపీ నాయకుడు
జి.కొండూరు: యూరియా కొరతతో ఒక్క కట్ట దొరికినా చాలు అన్నట్లు రైతులు సహకార సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలోని ఓ రేకుల షెడ్డులో నిల్వ ఉంచిన యూరియా కట్టలు మంగళవారం కలకలం రేపాయి. ఈ యూరియా కట్టలు ఇటీవల చెవుటూరు సహకార సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ నాయకుడికి చెందినవిగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సదరు టీడీపీ నాయకుడు సహకార సొసైటీ నుంచి యూరియా కట్టలను రైతుల పేరుతో పక్కదారి పట్టించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన సదరు టీడీపీ నాయ కుడు వెంటనే యూరియా కట్టలను రేకుల షెడ్డు నుంచి రైతుల ఇళ్లకు తరలించినట్లు తెలిసింది. ఆ వెంటనే కొందరు రైతులను చెవుటూరు సహకార సొసైటీకి పంపి ఆ యూరియా కట్టలు తమవేనని, అక్రమంగా నిల్వ ఉంచలేదని వారితో చెప్పించారు. ఈ ఘటనపై చెవుటూరు సహకార సొసైటీ అధికారులను ఆరా తీయగా సొసైటీకి జూలై నెలలో రెండు విడతలుగా 1,670 యూరియా కట్టలు, ఆగస్టు నెలలో 270 కట్టలు దిగుమతవగా 706 మంది రైతులకు ఈ బస్తాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. అయితే ఈ నెల 22వ తేదీన ఆత్కూరు గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల పేరుతో 35 కట్టల యూరియా, 13 కట్టల డీఏపీని పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే ఈ ఏడుగురు రైతుల పేరుతో సదరు టీడీపీ నాయకుడే యూరియా కట్టలను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తగానే నిల్వ చేసిన రేకుల షెడ్డు నుంచి యూరియా కట్టలను తరలించడంతో పాటు రేకుల షెడ్డు సైతం సదరు టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుల అధీనంలో ఉండడంతో అక్రమ నిల్వ ఆరోపణలకు బలం చేకూర్చింది. అంతే కాకుండా ఆత్కూరు గ్రామంలో వేరువేరు ప్రాంతాల్లో యూరియా కట్టలను నిల్వ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై జి.కొండూరు మండల వ్యవసాయాధికారి కేసీహెచ్ సూరిబాబు, ఎస్‌ఐ సతీష్‌కుమార్ చెవుటూరు సహకార సొసైటీకి చేరుకొని విచారణ చేపట్టారు.

కలకలంరేపిన యూరియా నిల్వలు