
జి.కొండూరులో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం పర్యటన
జి.కొండూరు: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సభ్యుల బృందం శనివారం జి.కొండూరు గ్రామంలో పర్యటించింది. పది రాష్ట్రాలకు చెందిన 90 మంది సభ్యుల బృందం ఈ పర్యటనలో పాల్గొంది. ఈ బృందానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు బాలు, వీరేంద్రసింగ్ నేతృత్వం వహించారు. పర్యటనలో భాగంగా ఈ బృంద సభ్యులు జి.కొండూరు గ్రామంలో గతేడాది పులివాగు వరద ఉధృతికి ముంపునకు గురైన ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. పులివాగును సందర్శించి వాగులో నీటి ప్రవాహ సామర్ధ్యం గురించి తెలుసుకున్నారు. వరదల సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు, పంట నష్టం, ప్రాణ నష్టం, బాధితులకు అందిన పరిహారం వంటి అంశాలను స్థానిక తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు బృందానికి వివరించారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హాలులో మండల అధికారులు, స్థానిక ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను బృందం సభ్యులు వివరించారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో సర్పంచ్ మండల అరుణ, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి బసవలింగేశ్వరరావు పాల్గొన్నారు.