
ముంచేసినది
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మంగళవారం అర్ధరాత్రి, బుధవారం జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలో, విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. బుడమేరు వాగు ఉధృతి పెరుగుతోంది. విజయవాడ పశ్చిమలో డ్రెయిన్లు పొంగి, రోడ్ల మీద నాలుగు అడుగుల మేర నీరు చేరాయి. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం.. టీడీపీ 53వ డివిజన్ అధ్యక్షుడు తిరువాయి పాటి మధుసూదరావు, టీడీపీ కార్యకర్త షేక్ ముర్తజ్‌ను పొట్టన పెట్టుకొంది. గులాం మొహద్గీర వీధిలో యూజీడీ కోసం అనేక చోట్ల 10నుంచి 14 అడుగుల గోతుల్ని తీసి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వర్షం నీరు మూడునుంచి నాలుగు అడుగుల మేర నిలిచింది. అక్కడ గోతులు ఉన్నాయనే విషయం తెలియక గీతా మందిరం వీధి చివర గొయ్యిలో మధుసూదనరావు, జెండా చెట్టు వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకొని ముర్తాజ్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. విధ్యాధరపురం డిపో, జోనల్ వర్క్‌షాపు, వించిపేట, గణపతిరావునగర్, తారక రామనగర్, భవానీపురం, లేబర్ కాలనీ.. ఇలా పలు కాలనీలు నీట మునిగాయి. లయోల కాలేజీ సమీపంలో పటమట నివాసి అజయ్‌కుమార్‌పైన చెట్టు పడటం ప్రాణాలు విడిచారు. గుణదల సమీపంలోని పుల్లేటి డ్రెయిన్, టిక్కిల్ రోడ్డు, పన్నిమనేని పాలీక్లినిక్ రోడ్డు , ఈఎస్‌ఐ రోడ్డు, నిర్మల కాన్వెంట్ రోడ్డు, డెంటల్ కాలేజీ రోడ్డు , ఏలూరు రోడ్డు, బుడమేరు ఏలూరు కాలువ మధ్యకట్ట, ఆర్టీసీ లేబర్ కాలనీలో డ్రెయిన్లు పొంగాయి.
కృష్ణా నదికి పెరుగుతున్న వరద
కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో 3,44,638 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. రెండు, మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు, పులిచింతల, మున్నేరు క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి 5లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నం. 91549 70454 ఏర్పాటు చేశారు.
87.03 మిల్లీమీటర్ల వర్షపాతం
ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం రాత్రి 6.30 గంటల మధ్య 87.03 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 170.5 మిల్లీమీటర్లు, కంచికచర్లలో 110.7, జగ్గయ్యపేటలో 146.5, వీరులపాడులో 123.2, విజయవాడ నార్త్‌లో 123.8, విజయవాడ సెంట్రల్‌లో 127. 4, విజయవాడ వెస్ట్‌లో 127.4 , విజయవాడ ఈస్ట్‌లో 121.4, చందర్లపాడులో 102.4, విసన్నపేటలో 55.2, ఏ కొండూరులో 68.8, రెడ్డిగూడెంలో 109.3, మైలవరంలో 43.0, విజయవాడ రూరల్‌లో 60.0, నందిగామలో 78.0, జి కొండూరు లో 38.1, వత్సవాయిలో 62.3, పెనుగంచిప్రోలులో 63.6, తిరువూరులో 17.6 , గంపలగూడెంలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో పలుప్రాంతాలు జలమయం బుడమేరుకు వాగుకు పెరుగుతున్న వరద ఉధృతి గుణదల వంతెనపై నుంచి ప్రవహించిన నీరు కృష్ణా నది ఎగువ నుంచి భారీగా వరద విజయవాడ వన్‌టౌన్‌లో డ్రెయిన్‌లో పడి ఇద్దరు, లయోల కాలేజీ సమీపంలో మరొకరు మృతి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 91549 70454
రెండు రోజులుగా దంచికొడుతున్న వాన

ముంచేసినది