
‘నులి’ నిర్మూలనతో బహుళ ప్రయోజనాలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
లబ్బీపేట(విజయవాడతూర్పు): నులి పురుగులు పిల్లలు, కిశోర బాలల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమవుతాయని, అందుకే పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రను తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. పటమటలంకలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మంగళవారం జరిగిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి చిన్నారులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులి పురుగుల కారణంగా పలు శారీరక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. దీంతో చదువులో రాణించలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా చూసుకోవచ్చన్నారు.
20న మరోసారి పంపిణీ..
1–19 ఏళ్ల వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా వివిధ కారణాల వల్ల మాత్ర తీసుకోకుండా ఉంటే వారికి ఈ నెల 20న ఇస్తామని కలెక్టర్ చెప్పారు. నులిపురుగుల నిర్మూలనతో పిల్లలకు ఆరోగ్య పరంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నులిపురుగుల సంక్రమణా న్ని తగ్గించేందుకు డీవార్మింగ్‌కు అదనంగా పాటించాల్సిన విషయాలను కూడా వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, ఆర్‌బీఎస్‌కే స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గ్లోరి, పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ రవితేజ, ఆర్‌బీఎస్‌కే జిల్లా అధికారి డాక్టర్ మాధవీనాయుడు, డీఈఓ డాక్టర్ సుబ్బారావు పాల్గొన్నారు.