
ప్రతి గుండె ఉప్పొంగేలా ‘హర్ ఘర్ తిరంగా’
కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి గుండె ఉప్పొంగేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పంద్రాగస్టు వేడుకులకు సిద్ధమవుతున్నామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ, పోలీస్, యువజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులు, సిబ్బందితో పాటు వాకర్స్ క్లబ్ వంటి వివిధ అసోసియేషన్ల నుంచి పెద్దఎత్తున ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బైక్, సైకిల్ ర్యాలీతో పాటు స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సైనికుల త్యాగాలు చిరస్మరణీయం..
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సరిహద్దుల్లో మన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని.. ఆపరేషన్ సిందూర్ మన దేశ సత్తాను చాటి చెప్పిందని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని.. మనకు స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో రంగాల్లో ముందుకెళ్లామని అన్నారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎం, ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు.శ్రీనివాసరావు, వీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని పాల్గొన్నారు.