
ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని నిర్మాణం
గుణదల(విజయవాడ తూర్పు): దేశానికి తలమానికంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ అన్నారు. విజయవాడ భారతీనగర్ నోవోటెల్ హోటల్లో గురువారం గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ – 2025 నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉంటుందని చెప్పారు. విజయవాడ నగర ప్రతిష్టతను ఇనుమడింప చేసే విధంగా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. అధునాతన నిర్మాణ శైలిని అనుసరిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటక రంగంలో రాజధాని గుర్తింపు సాధిస్తుందని వెల్లడించారు. అనంతరం గ్రీన్ ఆంధ్రప్రదేశ్ బ్రోచర్‌ను విడుదల చేశారు.
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
పెనమలూరు:పూర్వార్జిత ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు కాజేయటానికి ఏకంగా తహసీల్దార్ గోపాలకృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేయటంతో పోలీసులు 11 మందిపై గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం..... కానూరు గ్రామంలో ఆర్‌ఎస్ నెంబర్లు 249/3,4,5ఎలో 300 చదరపు గజాల ఇంటి స్థలం ఉంది. తహసీల్దార్ గోపాలకృష్ణ ఎండార్స్ చేసినట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని కొందరు వ్యక్తులు సృష్టించారు. దీంతో పోలుకొండ వెంకటాచలం అనే మహిళ తన మనవడు కౌశిక్‌కు అనుకూలంగా కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గిఫ్టు డీడ్ (16032/2024) ఇచ్చింది. దీనికి పలువురు వ్యక్తలు సహకరించి ఇంటి స్థలాన్ని అమ్మే యత్నం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావటంతో తహసీల్దార్ గోపాలకృష్ణ తన సంతకం ఫోర్జరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామోదుల సూరిబాబు, (ఎర్రసూరిబాబు), షేక్.వలి, బోరుగడ్డకుమార్, పోలుకొండ వెంకటాచలం, పోలుకొండ కౌశిక్, బి. వెంకటేశ్వరరావు, వి.లక్ష్మణరావు, వేములపల్లి శ్రీనివాసరావు, రాఘవమ్మ, అవనిగడ్డ స్వాతీ, సూరిబాబులని నిందితులుగా గుర్తించారు.