
రమేష్ యాదవ్‌పై దాడిని ఖండిస్తూ నిరసన
భవానీపురం(విజయవాడపశ్చిమ):ౖవెఎస్సార్ కడప జిల్లా పులివెందులలో జరుగనున్న జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్‌పై టీడీపీ గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మార్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి చిత్రాలను పట్టుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీడీపీ గూండాలు వైఎస్సార్ సీపీ నేతలపై దాడి చేసి మట్టుపెట్టటానికి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని దౌర్జన్యం, దాడులకు పూనుకుంటే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ స్పందించి పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సంపతి విజిత మాట్లాడుతూ హోం మంత్రి ఒక రబ్బర్ స్టాంప్‌గా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బొడ్డు అప్పలనాయుడు, బొందిలి నరేంద్ర సింగ్, బత్తుల రామారావు, కె నాగేశ్వరరావు, కొరివి చైతన్య, షేక్ మస్తాన్, దుక్కా హరి భాస్కర్, జవ్వాది నరసింహారావు, కలపాల అజయ్, వేదాంతం చైతన్య, బూదాల సౌమ్య, పార్టీ నాయకులు విశ్వనాథ రవి, టి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో
పూలే విగ్రహానికి వినతి పత్రం