వేతన పాట్లు.. దాహం కేకలు! | - | Sakshi
Sakshi News home page

వేతన పాట్లు.. దాహం కేకలు!

Aug 7 2025 11:07 AM | Updated on Aug 7 2025 11:07 AM

వేతన

వేతన పాట్లు.. దాహం కేకలు!

ఇబ్రహీంపట్నం: కొండపల్లి మునిసిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని గ్రామాలు, మైలవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని 62 గ్రామ పంచాయతీల పరిధిలో మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచి పోయింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు మూడు నెలల వేతనాలతో పాటు మూడేళ్ల క్రితం నుంచి ఏరియర్స్‌ చెల్లించాలని పలువురు కార్మికులు సమ్మె బాట పట్టారు. పంపింగ్‌ హౌస్‌ మోటార్లు ఆన్‌ చేసేవారు లేకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. వైఎస్సార్‌ సీపీ నాయకులు, వామపక్ష నాయకుల పోరాట పటిమతో కాంట్రాక్టర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు దిగొచ్చారు. కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని, విధులకు హాజరు కావాలని కోరారు.

మూడు రోజులుగా తాగునీటి వెతలు..

కాంట్రాక్ట్‌ కార్మికులు మూడు రోజుల సమ్మె నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడ రూరల్‌(ఐదు గ్రామాలు), రెడ్డిగూడెం, మైలవరం గ్రామ పంచాయితీలతో పాటు కొండపల్లి మునిసిపాలిటీలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వేసవిని తలపిస్తున్న ఎండలకు ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్‌ కలిగిన బోరు పంపు నీటిని తాగాల్సి వచ్చింది. మండల కేంద్రాలు, కొండపల్లి మునిసిపాలిటీలో మినరల్‌ వాటర్‌ పేరుతో అమ్ముతున్న వాటర్‌ క్యాన్‌లు కొనుగోలు చేసుకున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కొందరు నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేశారు. అధికారులు కొన్ని ట్యాంకర్ల ఏర్పాటు చేసినప్పటికీ కూటమి నాయకుల కనుసన్నల్లో వారికిష్టమైన ప్రాంతాల్లోనే సరఫరా చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.

వైఎస్సార్‌ సీపీ నాయకుల పోరుబాట..

తాగునీటి సరఫరా పునరుద్ధరణకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, సీపీఐ, సీఐటీయూ నాయకులు పోరాట పటిమ చూపారు. వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ గుంజా శ్రీనివాస్‌ నేతృత్వంలో పలువురు కౌన్సిలర్‌లు, పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు నీటి సరఫరా పునరుద్ధరణ చేపట్టాలని మునిసిపల్‌ కమిషనర్‌ రమ్యకీర్తనకు వినతిపత్రం అందజేశారు. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వద్ద సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులతో చర్చలు జరిపారు. విషయం తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ చీఫ్‌ గాయత్రిదేవి, కాంట్రాక్టర్‌ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ప్రజలకు తాగునీరు సరఫరా పునరుద్ధరించాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు పట్టుబట్టారు. గాయత్రీదేవి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్‌ సూచనలతో కార్మికులు అప్పటికప్పుడు సమ్మె విరమించారు. పంపు మోటార్లు ఆన్‌చేసి తాగు నీటిని విడుదల చేశారు.

కాంట్రాక్టర్‌ కనుసన్నల్లోనేనా?

ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలో పనులు దక్కించుకున్న విజయవాడకు చెందిన కాంట్రాక్టర్‌ కనుసన్నల్లోనే కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెకు దిగినట్లు ప్రచారం సాగుతోంది. కాంట్రాక్టర్‌ నిర్వహించే తాగునీటి సరఫరా పనులకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.3.50కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అతనే కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు దించినట్లు తెలుస్తోంది. యజమాని వంటి కాంట్రాక్టర్‌ హామీ ఇవ్వడంతో కార్మికులు మూడు రోజులుగా సమ్మె బాట పట్టారు. వాస్తవంగా కార్మికులు సమ్మె బాట పడితే కాంట్రాక్టర్‌ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ప్రజలకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఆ దిశగా అడుగులు వేయకుండా బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

సమ్మెకు దిగిన ఆర్‌డబ్ల్యూఎస్‌

కార్మికులు

మూడు రోజులుగా 62 గ్రామాల్లో

ప్రజలకు తాగునీటి కష్టాలు

వైఎస్సార్‌ సీపీ పోరాటంతో

నీటి సరఫరా పునరుద్ధరణ

కాంట్రాక్టర్‌ ప్రోద్బలంతోనే కార్మికులు

సమ్మెబాట పట్టినట్లు ఆరోపణలు

వేతన పాట్లు.. దాహం కేకలు! 1
1/1

వేతన పాట్లు.. దాహం కేకలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement